వైకాపా సీనియర్ నేత ఎం.వి.మైసూరా రెడ్డి ఇవ్వాళ్ళ పార్టీ వీడే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. మరికొద్ది సేపటిలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చాలా సీనియర్ అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనను అసలు పట్టించుకోవడం లేదని, పార్టీలో తనను పూర్తిగా పక్కన పెట్టేసి కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారనే బాధతో మైసూరా రెడ్డి చాలా కాలంగా పార్టీకి, దాని కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య ఒకసారి పార్టీని వీడి రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభిద్దామని కూడా ఆలోచించారు కానీ మళ్ళీ ఎందుకో వెనకడుగు వేశారు. అప్పటి నుంచి ఆయన ఏదో ఒకరోజు వైకాపాని వీడటం ఖాయం అనే సంకేతాలు స్పష్టంగా ఇస్తూనే ఉన్నారు కానీ వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. అది ఆయనకి ఇంకా ఆగ్రహం కలిగించి ఉండవచ్చు. అందుకే కొన్ని రోజుల క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై తనను వైకాపా సభ్యుడిగా సంబోధించవద్దని కోరారు. ఇన్నాళ్ళుగా నిర్ణయం తీసుకోవడానికి ఆయన వెనుకాడినా చివరికి ఇవ్వాళ్ళ పార్టీని వీడేందుకు సిద్దం అవుతున్నట్లున్నారు. అయితే ఆయన వైకాపాని వీడి తెదేపాలో చేరబోతున్నారా లేక కొంత కాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారా అనే విషయం మరికొద్ది సేపటిలో తెలియవచ్చు.