వైకాపాలో వలసల పర్వం ఇంకా కొనసాగేటట్లే కనిపిస్తోంది. ఇవ్వాళ్ళ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించినప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్.వి. మైసూరా రెడ్డి వెళ్లి ఆయనను కలవకుండా స్థానికంగా ఉండే ఒక హోటల్లో తన అనుచరులతో కలిసి సమావేశమయినట్లు తాజా సమాచారం. ఆయన తెదేపాలో చేరుతారని గత కొన్ని రోజులుగా మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని ఆయన నిజం చేయబోతున్నారేమో? ఇటీవల జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెదేపాలోకి వెళ్లిపోవడంతో జగన్మోహన్ రెడ్డి తనను సంప్రదించకుండా ఆయన స్థానంలో తన అన్న కుమారుడిని జమ్మలమడుగు ఇన్-చార్జ్ గా నియమించినందుకు మైసూరా రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఎలాగూ పార్టీలో ఆయనకిప్పుడు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు కనుక తెదేపా ఆహ్వానాన్ని మన్నించి పార్టీ మారిపోతారేమో చూడాలి.