మైసూరా రెడ్డి వైకాపాకి రాజీనామా చేసిన తరువాత ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని నమ్మశక్యంకాని మాటలు చెప్పారు. వాటిలో మొదటిది తనను జగన్ అల్పాహారం కోసం అని ఆహ్వానించి పార్టీ కండువా కప్పారని. రెండవది తను వైకాపాలో చేరాలనే ఉద్దేశ్యంతో జగన్ వద్దకు వెళ్లలేదని చెప్పడం.
ఆయన తెదేపాలో ఉన్నప్పుడు, కొందరు మధ్యవర్తులు ఒత్తిడి చేయడంతో ‘జగన్ తో మాట్లాడితే తప్పేమిటనే’ ఉద్దేశ్యంతోనే వెళ్లానని చెప్పారు. “జగన్మోహన్ రెడ్డిని కలిసే సమయానికే నేను వైకాపాలో చేరుతున్నట్లు టీవీ చానళ్ళలో స్క్రోలింగ్ మొదలయిపోయింది. అవి చూసి తెదేపా అధిష్టానం నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అల్పాహారం కోసం వెళ్ళిన నా మెడలో జగన్మోహన్ రెడ్డి వైకాపా కండువా కప్పేశారు. ఇంక నాకు వేరే గత్యంతరం లేక వైకాపాలో కొనసాగవలసి వచ్చింది,” అని మైసూరా రెడ్డి చెప్పారు.
“2014 సార్వత్రిక ఎన్నికలలో వైకాపాయే విజయం సాధిస్తుందని, కనుక నేను వైకాపాలో చేరినట్లయితే రాజ్యసభ సీటుతో బాటు, కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తానని మధ్యవర్తుల ద్వారా జగన్ నాకు హామీ ఇచ్చారు. కానీ వైకాపాలో చేరాలనే ఉద్దేశ్యంతో నేను జగన్ ఇంటికి వెళ్ళలేదు. కానీ వెళ్ళాక ఊహించని విధంగా అలాగ జరిగిపోయింది,” అని మైసూరా చెప్పారు.
రాష్ట్ర రాజకీయనేతలలో చాలా సీనియర్ అయిన మైసూరా రెడ్డి ఈవిధంగా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. వైకాపాలో చేరితే రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆయనే చెప్పుకొన్నారు. దానికి ఆయన ఆశపడకపోయుంటే మధ్యవర్తుల వద్దనే తిరస్కరించవచ్చు కానీ తెదేపాలో ఉంటూ ‘జగన్ ఇంటికి వెళితే తప్పేమిటి…ఆయనతో కలిసి టిఫిన్ చేస్తే తప్పేమిటి?’ అనుకొంటూ వెళ్లానని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
టీవీలో స్క్రోలింగ్ లను చూసి తెదేపా తనను సస్పెండ్ చేసిందని చెప్పడం మరీ విచిత్రంగా ఉంది. అంతకు ముందు చాలా రోజుల నుంచే ఆయన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో విభేదించి పార్టీకి దూరంగా ఉండేవారు. అది చూసే జగన్ ఆయనకు ఆఫర్ ఇచ్చేరు. అందుకే ఆయన జగన్ ఇంటికి వెళ్లి కండువా కప్పుకొన్నారని అర్ధమవుతోంది. కానీ ఆ తరువాత ఆయన ఊహించని విధంగా ఎన్నికలో వైకాపా ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏ పదవీ ఇవ్వలేకపోయారు. బహుశః అదే మైసూరా అసంతృప్తికి కారణం అయ్యుండవచ్చు. జగన్ తీరుతో అది క్రమంగా పెరిగి చివరికి రాజినామాకి దారి తీసిందని భావించవచ్చు. జగన్ వ్యవహార శైలి గురించి మైసూరా చేసిన ఆరోపణలలో నిజముండవచ్చునేమో కానీ వైకాపాలో చేరడం అనుకోకుండా జరిగిపోయిందని చెప్పడం మాత్రం నమ్మశక్యంగా లేదు. ఇప్పుడు తెదేపాలో చేరితే మళ్ళీ ఏమి కొత్త స్టోరీ చెపుతారో?