ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జల విధానం … ఇప్పటికే.. జనవనరుల నిపుణుల్లో చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా.. గోదావరి నీళ్లు దయతో.. కేసీఆర్ ఏపీకి ఇస్తున్నాడన్న వ్యాఖ్యల దగ్గర్నుంచి ఆ నీళ్లు ఏపీకి తెచ్చుకోవడానికి తెలంగాణ భూభాగంలో.. ఏపీ ఖర్చుతో.. ప్రాజెక్టు నిర్మించాలనుకోవడం వరకూ.. అన్నింటిపైనా.. విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు… ఘన విజయం సాధించిన ఊపులో జగన్ ఉన్నారు కాబట్టి.. చాలా మంది మేధావులనబడేవాళ్లు పెద్దగా మాట్లాడటం లేదు. కానీ.. ఒక్క సారి ప్రజల్లో కదలిక వస్తే మాత్రం.. వారికి సర్ది చెప్పడం కష్టమవుతుంది. ఈ కదలిక తెచ్చే ప్రయత్నాలను… ఇద్దరు సీమ సీనియర్ నేతలు తీసుకున్నారు. వారిద్దరూ.. ఇప్పుడు జిల్లాల వారీగా.. మేధావలు, రైతులు, జలవనరుల నిపుణులతో సమావేశాలు పెట్టి.. జగన్ జల విధానంతో.. సీమ ఎడారిగా మారబోతోందని ప్రచారం చేస్తున్నారు.
ఆ ఇద్దరు సీమ సీనియర్ నేతలు ఎవరో కాదు… రాజకీయాల్లో తల పండినపోయిన వాళ్లే. ఒకరు మాజీ మంత్రి మైసూరారెడ్డి కాగా.. మరొకరు తులసీరెడ్డి. రాజకీయ ప్రయోజనాలపై.. వీరికి మొదటి నుంచి ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేతలు కావడంతో.. సీమకు ఏది అవసరమో కూడా తెలుసు. రాయలసీమ కరువు, ఇతర అంశాలపై పుస్తకాలు రాసిన అనుభవం కూడా ఉంది. ఒకప్పుడు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్లు. తర్వాత మైసూర్ పార్టీలు మారి .. మారి.. చివరికి ఏ పార్టీలోనూ లేకుండా అయ్యారు. తులసీరెడ్డి మాత్రం.. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు నడిచినా.. చివరికి.. మళ్లీ కాంగ్రెస్‌లోనే సర్దుకున్నారు. వీరిద్దరూ.. జగన్ జల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. రాయలసీమ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు.
పోలవరం పూర్తి అయితే.. రాయలసీమకు కరువు ఉండదని.. కానీ.. తెలంగాణతో.. గోదావరి నికరజలాలను పంచుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయడం వల్ల… మొత్తానికే తేడా వస్తుందని వీరు వాదిస్తున్నారు. దీనికి సంబంధించి.. వారు పెడుతున్న సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తున్నారు. గోదావరి నికర జలాలపై సంపూర్ణ హక్కులు.. ఏపీకి ఉన్నప్పుడు.. ఎగువ రాష్ట్రంతో ఒప్పందాలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణతో అసలు ఎలాంటి జల బంధం వద్దని అంటున్నారు. వీరి వాదన రాయలసీమ ప్రజల్లోకి వెళ్తే.. జగన్మోహన్ రెడ్డికి.. రాజకీయ పరంగా కూడా.. ఇబ్బందికరం అయ్యే అవకాశం కనిపిస్తోంది.