కడప జిల్లా సీనియర్ రాజకీయ నేత మైసూరా రెడ్డి వైసీపీకి దూరమయిన తర్వాత ఏ పార్టీలోనూ చేరలేదు. ఆయనను పార్టీలో చేర్చుకోవాలని ఏ పార్టీ కూడా ఇంత వరకూ ప్రయత్నాలు చేయలేదు. వైఎస్ సమకాలికులుగా గుర్తింపు తెచ్చుకున్న… డీఎల్ రవీంద్రారెడ్డి, మైసూరారెడ్డి.., ఇద్దరిదీ ఒకటే పరిస్థితి. ఏ పార్టీలోనూ లేరు. కానీ రాజకీయంపై మాత్రం ఆశ ఉంది. అందుకే… ఏ పార్టీ పెద్ద పీట వేస్తుందా.. అని ఎదురు చూస్తున్నారు. తమ స్థాయికి.. ఏదో పార్టీలో చేరి టిక్కెట్ తెచ్చుకోవడం కాకుండా.. అంతకు మించిన పాత్ర కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది కానీ… వారి అంచనాలు ఎక్కడో ఉండటం వల్ల… చంద్రబాబు పట్టించుకోలేదని చెబుతున్నారు. వీరిద్దరిలో ఇప్పుడు.. మైసూరారెడ్డి దూకుడు ప్రారంభించారు. ఆ మధ్య రాయలసీమవాదం వినిపించడం ప్రారంభించారు. మధ్యలో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు.
ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి… మైసూరారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు శివరామకృష్ణ, మదన్మోహనరెడ్డి కలిపి ఓ లేఖ రాశారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమపై వివక్ష చూపుతున్నారనే ముద్ర వేయడం..ఆ లేఖ టార్గెట్. అందులో మ్యాటర్ అంతా అంతే ఉంది. నీటి పంపకాల విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోంది… రాష్ట్ర విభజనతో ఎక్కువ నష్టపోయింది రాయలసీమనే అయినా ఏపీ సీఎం, ప్రతిపక్షనేతలిద్దరూ రాయలసీమ వాసులే… అయినా సీమపై వివక్ష చూపుతున్నారని లేఖలో ఆరోపించుకొచ్చారు. ఏపీ రాజధాని, హైకోర్టు రెండూ ఒకే ప్రాంతంలో నిర్మించి సీమకు అన్యాయం చేశారనేది మరో వాదన. రాజధానిలో హైకోర్టు ఉండటం..అనేది మామూలే. అదేదో అన్ని రాష్ట్రాల్లోనూ వేరే చోట ఉంది.. ఏపీలో మాత్రమే.. రాజధానిలో హైకోర్టు కడుతున్నారన్నట్లుగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఇంత వరకూ బాగానే ఉంది కానీ… మైసూరా.. అటు చంద్రబాబు, ఇటు జగన్ పై ఎందుకు.. రాయలసీమ వ్యతిరేకులుగా ముద్ర వేయాలనుకుంటున్నారు అంటే… ఆయన చూపు జనసేనపై పడిందన్నమాట. ఆయన జనసేన పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయని.. అందుకే కొత్తగా రాయలసీమ వాదం వినిపించి.. ఆ పార్టీలో చేరిపోయేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. మొత్తానికి జగమెరిగిన మైసూరారెడ్డి కూడా.. చివరికి… తన రాజకీయానికి.. రాయలసీమనే వాడుకుంటున్నారు.