తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా చలామణీ అవుతున్న మైత్రీ మూవీస్ ఇప్పుడు ఇతర భాషా చిత్రాలపై దృష్టి పెట్టింది. బాలీవుడ్ లో ఓ భారీ చిత్రాన్ని రూపొందించిందుకు సన్నాహాలు చేస్తున్న మైత్రీ మూవీస్ తాజాగా మల్లూవుడ్ లోనూ కాలుమోపింది. మలయాళంలో సూపర్ హిట్లు కొడుతున్న టొవినో థామస్తో ఓ చిత్రానికి క్లాప్ కొట్టింది. డ్రైవింగ్ లైసెన్స్ లాంటి మర్చిపోలేని సినిమా ఇచ్చిన లాల్ జూనియర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి `నడికర్ తిలకం` అనే పేరు ఖరారు చేశారు. ఈరోజు కొచ్చిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. టొవినో థామస్ నటించిన కొన్ని చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. అందులో `2018` ఒకటి. కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. టొవినో నటించిన `మిన్నల్ మురళి` మలయాళంలో ఓ పెద్ద సంచలనం. తనతో సినిమాలు చేయడానికి బడా నిర్మాతలు రెడీగా ఉన్నారు. అయితే ఆ అవకాశం మైత్రీకి దక్కింది. టొవినో థామస్ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రమని మైత్రీ మూవీస్ తెలిపింది.