ఈరోజుల్లో సినిమాలు తీయడం ఒక వంతు అయితే ఆ సినిమాని ప్రమోట్ చేయడం మరో పెద్ద పని. గొప్ప కంటెంట్ ఉన్న సినిమా తీయగానే సరిపోదు ఆ కంటెంట్ ని జనాలకి రీచ్ అయ్యేలా చెప్పడం కూడా ఒక పెద్ద క్రియేటివ్ టాస్క్. ఇది జరగాలంటే ముందుగా హీరో ముందడుగు వేయాలి. సినిమాని ప్రమోట్ చేయడంలో హీరోదే ముఖ్య భూమిక. హీరో వస్తేనే ప్రమోషన్స్ కి ఒక జోష్ వస్తుంది. హీరో లేకుండా హీరోయిన్, దర్శకుడు, నిర్మాత, మిగతా టెక్నీషియన్లు ఎంత చెప్పుకున్నా దానికి అట్రాక్షన్ తోడవ్వదు. అయితే కొంతమంది హీరోలు మాత్రం ఇప్పటికీ ప్రమోషన్స్ అంటే ఎందుకో అంత ఆసక్తి చూపించరు. ఈ వరుసలో తమిళ హీరో అజిత్ ముందు ఉంటాడు.
అజిత్ కి ప్రమోషన్స్ మీద ఆసక్తి ఉండదు. ఆయన సినిమా వేడుకలు పెద్దగా ఉండవు. మీడియా ముందుకు వచ్చి గాని లేదా ఇంటర్వ్యూలు ఇచ్చి గాని ఆయన మాట్లాడింది చాలా తక్కువ. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 10 లోనే ఈ సినిమా రిలీజ్. 9వ తేదీన ప్రీమియర్స్ ఉంటాయని అంటున్నారు. సరిగ్గా వారం వుంది. అయితే ఇప్పటివరకు ప్రమోషన్స్ లో ఎలాంటి కదలిక లేదు.
నిజానికి మైత్రి మూవీ మేకర్స్ చాలా గట్టిగా ప్రమోషన్ చేస్తారు. ప్రమోషన్స్ కి ఎంత ఖర్చైనా సిద్ధంగా ఉంటారు. కానీ ఆ ప్రమోషన్ చేయడానికి ముందుకు రావాల్సిందే హీరో. ఇక్కడే అసలు సమస్య. తమిళ్ లో కూడా ఈ సినిమాకి చెప్పుకొదగ్గ ప్రచారం కనిపించలేదు. మైత్రీ మూవీ మేకర్స్ కాబట్టి ఈ సినిమా తెలుగులో మంచి రిలీజే వుంటుంది. కానీ అజిత్ ఏదైనా ఈవెంట్ కి వస్తాడా ? అనేది అనుమానం. ఒకవేళ మైత్రీ మేకర్స్ అజిత్ ని ఇక్కడికి తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఎంతోకొంత బజ్ యాడ్ అవుతుంది. మరి అది సాధ్యపడుతుందో లేదో చూడాలి.