మైత్రీ పంట పండింది. వరుసగా మూడు బ్లాక్ బ్లస్టర్లతో తమ ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తోంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్… ఇప్పుడు రంగస్థలం. ఈ మూడింట్లో `రంగస్థలం` అత్యధిక వసూళ్లు తెచ్చిపెట్టింది. అందుకే సుకుమార్‌కి మరోసారి అడ్వాన్స్ ఇచ్చేశారు మైత్రీ మూవీస్ వాళ్లు.
అయితే ఇదంతా రంగస్థలం హిట్టయినందుకు కాదు. రిలీజ్‌కి ముందే… సుక్కు చేతిలో రెండో సినిమాకి సంబంధించిన అడ్వాన్స్పడింది. దీనికి ప్రధానమైన కారణాలు రెండున్నాయి.
ఒకటి…. మైత్రీ దాదాపుగా అగ్ర దర్శకులందరికీ అడ్వాన్సులు ఇచ్చింది. ఓ హిట్టు కొట్టి.. రెండో సినిమా కోసం ఎదురుచూస్తున్న చాలామంది దర్శకులపై మైత్రీ కర్చీఫ్ వేసింది. రంగస్థలం హిట్ ని ముందే ఊహించిన మైత్రీ మూవీస్ సుకుమార్‌ని అట్టి పెట్టుకోవాలనుకోవడంలో వింతేం లేదు.
రెండోకారణం కూడా ఉంది. రంగస్థలం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయ్యింది. దాదాపుగా రూ.12 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సివచ్చింది. విడుదలకు ముందు లెక్కలేస్తే… నిర్మాతలు చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. విడుదలయ్యాక సరిగా ఆడకపోతే… మైత్రీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. హిట్ కొట్టినా.. తిరిగిరాబట్టుకోవడం కష్టమేమో అని భావించారు. అందుకే సుకుమార్‌తో మరో సినిమా ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ‘రంగస్థలం` బాగా ఆడి లాభాలొస్తే సరి. లేదంటే.. రెండో సినిమా మాత్రం తక్కువ రెమ్యునరేషన్‌తో పూర్తి చేయాలన్నది ఒప్పందం. రంగస్థలం కోసం సుకుమార్ కి అక్షరాలా రూ.8 కోట్ల పారితోషికం ఇచ్చారు. అందులో రెండో సినిమాకి కాస్త తగ్గించుకోవాలి. కానీ ఇప్పుడు రంగస్థలం సూపర్ డూపర్ హిట్టయ్యింది. కాబట్టి రెమ్యునరేషన్లో కోత లేనట్టే. ఈసారి రూ.8 కోట్లకే సినిమా చేస్తాడా, లేదంటే పారితోషికం పెంచుతారా అనేది తేలాల్సివుంది.