అగ్ర కథానాయకులకు, దర్శకులకు అడ్వాన్సులు ఇవ్వడంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్ధ మిగతా నిర్మాణ సంస్థలతో పోలిస్తే ముందంజలో వుంది. ప్రస్తుతం పది సినిమాలు లైనులో వున్నాయని నిర్మాతలే చెప్పారంటే ఎంత మంది కథానాయకులు, దర్శకుల దగ్గర మైత్రీ నిర్మాతల అడ్వాన్సులు వున్నాయో అర్థం చేసుకోవచ్చు. మైత్రీ సంస్థ అడ్వాన్సులు ఇచ్చిన కథానాయకుల్లో పవన్ కల్యాణ్ ఒకరు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని కథ కూడా సిద్ధం చేశారు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో అదే కథతో రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో ఒక సినిమా ప్రారంభించనున్నారు. దీనికి పవన్ నుంచి అనుమతి తీసుకున్నామని నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ తెలిపారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ తన పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించారు. ఇకపై సినిమాలు చేయనని చెప్పారు. ఈ నేపథ్యంలో మైత్రీ నిర్మాతలు పవన్ ను అడ్వాన్సు తిరిగి ఇవ్వమని కోరినట్టు వార్తలు వచ్చాయి. అవి నిజమా? కాదా? అని నిర్మాతలను అడిగితే “వాటిలో నిజం లేదు. మేము పవన్ కల్యాణ్ గారిని అడ్వాన్సు తిరిగి ఇవ్వమని అడగలేదు. ఆయనతో సినిమా వుంటుంది. ఎన్నికల తరువాత పవన్ సినిమా చేస్తారని ఆశిస్తున్నాం. పవన్ సినిమాపై వివాదాలు వద్దు” అని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ సినిమా వుంటుందని, హీరో ఎవరు అనేది త్రివిక్రమ్ నిర్ణయానికి వదిలేశామని తెలిపారు.