ఓ స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. చాలా విషయాలు బేరీజు వేసుకోవాలి. ఖర్చుకి వెనుకంజ వేయకూడదు. రీషూట్లు అంటే ఒప్పుకోవాలి. సినిమా విడుదల ఆలస్యమైనా ఓపిక పట్టాలి. పబ్లిసిటీ బ్రహ్మాండంగా చేయాలి. అభిమానుల్ని సైతం సంతృప్తి పరచాలి. అలాంటిది.. ఒకేసారి ఇద్దరు హీరోలతో సినిమాలు తీయడం, ఒకే రోజు వ్యవధిలో విడుదల చేయడం మామూలు విషయం కాదు. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి.. ఈ రెండు చిత్రాల్నీ నిర్మించింది మైత్రీ మూవీస్. ఆ సమయంలో వాళ్లు ఎదుర్కొన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. రిలీజ్ డేట్లు ప్రకటించడం దగ్గర్నుంచి, థియేటర్ల పంపిణీ వరకూ. పబ్లిసిటీ నుంచి… కలక్షన్ల వివరాలు ప్రకటించడం వరకూ.. అన్నింటిలోనూ మైత్రీ బ్యాలెన్స్ పాటించింది.
నిజానికి కలక్షన్ల విషయంలో మైత్రీ గోప్యత పాటిస్తుందని అంతా భావించారు. పెద్ద హీరోలతో సినిమాలు, పైగా ఫ్యాన్స్ ఈగోని సైతం హర్ట్ చేయకూడదు.. అందుకే లెక్కలు బయటకు రానివ్వకుండా మైత్రీ జాగ్రత్త పడుతుందేమో అనుకొన్నారంతా. కానీ… మైత్రీ ఎప్పటిలానే వసూళ్లతో పోస్టర్లు వదిలింది. ఏ సినిమాకి ఎంతొచ్చింది? అసలు ఆ అంకెలన్నీ నిజమేనా..? అనే విషయాలు పక్కన పెడితే… ఇలా వసూళ్ల లెక్కలు కూడా బయటకు చెప్పాలన్న ఆలోచనకు గట్స్ ఉండాలి. మొత్తానికి.. మైత్రీకి ఈ సంక్రాంతి కలిసొచ్చింది. లోలోపల ఎన్ని ఇబ్బందులు పడినా.. ఇండస్ట్రీ పరంగా అన్ని విషయాలూ సజావుగా సాగిపోయినట్టే లెక్క. ఒకేసారి ఇద్దరు హీరోల్ని, వాళ్ల ఫ్యాన్స్‌నీ డీల్ చేసే విషయంలో మైత్రీ వ్యూహం మిగిలిన నిర్మాణ సంస్థలకు ఓ చక్కని గైడ్‌లా ఉపయోగపడుతుంది.