మైత్రీ మూవీస్ అనగానే భారీ బడ్జెట్ చిత్రాలే గుర్తొస్తాయి. జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, రంగస్థలం.. ఇలా అన్నీ స్టార్ హీరోలతోనే చేశారు. ఇప్పుడు వస్తున్న సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ రెండూ భారీ చిత్రాలే. ఒక్కో సినిమాకీ దాదాపు రూ.60 నుంచి 70 కోట్లు పెట్టకపోతే వాళ్లకు సినిమా తీసినట్టే అనిపించదు. అలాంటిది ఇప్పుడో చిన్న సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు. దాని బడ్జెట్ ఎంతో తెలుసా?? రూ.89 లక్షలు. రితీష్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. సంగీతం, కెమెరా, ఎడిటింగ్, సీజీ.. ఈ డిపార్ట్మెంట్లన్నీ కొత్తవాళ్లతోనే నిండిపోబోతోంది. మరో పది రోజుల్లో షూటింగ్ కూడా మొదలెట్టేస్తార్ట.
మైత్రీ మూవీస్ నిర్మాతలలో ఒకరైన నవీన్ మాట్లాడుతూ ”చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. మంచి సినిమా తీయడమే ముఖ్యం. స్టార్ హీరోలతోనే కాదు, కొత్తవాళ్లతో కూడా ప్రయోగాలు చేస్తాం. పెద్ద సినిమా పెట్టుబడి తిరిగి రావడానికి మూడు రోజులు పడితే, చిన్న సినిమా హిట్టయితే పది రోజులు పడుతుంది. అంతే తేడా. చిన్న సినిమా కోసం ఓ మంచి టీమ్ దొరికింది. 89 లక్షల్లో సినిమా పూర్తి చేస్తాం. పబ్లిసిటీతో కలిపి రూ.1.5 కోట్లు అవుతుంది” అన్నారు.