2026 మైత్రీ మూవీస్‌కు చాలా కీలకమైన సంవత్సరం. ఈ యేడాదిలో మైత్రీ నుంచి 6 భారీ చిత్రాలు రాబోతున్నాయి. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలతో పాటు జై హనుమాన్ కూడా విడుదల కాబోతోంది. వీటితో పాటుగా పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, విజయ్ దేవరకొండ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇవన్నీ ‘బ్లాక్ బస్టర్లే’ అని మైత్రీ మూవీస్ నిర్మాత రవి బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
”2026 మా సంస్థలో ఆరు సినిమాలొస్తున్నాయి. అన్నీ బ్లాక్ బస్టర్. ‘మామూలు హిట్` అనిపించినా సరే, నా మాటలు నమ్మొద్దు. తరువాతి నుంచి వీడు అలానే చెబుతాడులే..’ అని లైట్ తీసుకోండి. తరవాత మీరు ఏమన్నా పడతాను. రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా నెక్ట్స్ లెవల్. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ ఇంటర్నేషనల్ లెవిల్. ప్రభాస్ – హనురాఘవపూడి సినిమాలో కొన్ని సీన్లు ఆర్.ఆర్. లేకుండా చూశాను. చాలా గొప్పగా తీశాడు. ‘జై హనుమాన్’ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అయ్యింది. అది కూడా భారీ స్థాయిలో ఉంటుంది. పవన్ కోసం హరీష్ శంకర్ స్క్రిప్ట్ లాక్ చేశాడు. పవన్ కల్యాణ్ గారి సినిమా అంటే… ఏ పాన్ ఇండియా బజ్ సరిపోదు” అంటూ 2026 మైత్రీ మూవీస్ లైనప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పకనే చెప్పారు రవి.
‘పుష్ప’తో మైత్రీ మూవీస్ భారీ లాభాల్ని సంపాదించింది. మిగిలిన భాషల్లోనూ సినిమాలు తీయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, జై హనుమాన్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. పెట్టబడి కూడా వాటికే ఎక్కువ షిఫ్ట్ చేసింది.