మైత్రీ మూవీస్ కి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. పుష్పతో ఈ సంస్థ నిలదొక్కుకొంది. పుష్ప 2 తో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇటీవల `రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్` తెలుగు డబ్బింగ్ ని మైత్రీనే రిలీజ్ చేసింది. ఈ సినిమాకు తెలుగు స్ట్రయిట్ సినిమాకు మించిన వసూళ్లు దక్కాయి. శని, ఆదివారాలు `డ్రాగన్` హోరు తెలుగు రాష్ట్రాల్లో కనిపించింది. ఈవారం కూడా పెద్దగా సినిమాలేమీ లేకపోవడంతో `డ్రాగన్`కు మరింత పబ్లిసిటీ చేసి, జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది మైత్రీ మూవీస్.
మరోవైపు ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమానీ మైత్రీనే నిర్మిస్తోంది. ఓవైపు ఎంటర్ ది డ్రాగన్ హిట్ తో ఖుషీలో ఉన్న మైత్రీ… ఎన్టీఆర్ – డ్రాగన్నీ ఎలివేట్ చేస్తోంది. ”ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా మామూలుగా ఉండదు. అది ఇంటర్నేషన్ మూవీ. వేరే లెవల్. ఈ డ్రాగన్ హిట్టవ్వడం హ్యాపీగా ఉంది. పెద్ద డ్రాగన్ వచ్చి వరల్డ్ మొత్తాన్నిచుట్టేస్తుంది” అని మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవి ఎన్టీఆర్ అభిమానులకు కావల్సినంత కిక్ ఇచ్చారు. ‘డ్రాగన్’ పేరు తమిళంలో ఇప్పుడు పాపులర్ అయిపోయింది. అది ఎన్టీఆర్ సినిమాకు తమిళ నాట కలిసొస్తుందన్నది మైత్రీ మూవీస్ నమ్మకం.
నిజానికి ‘డ్రాగన్’ సినిమాపై తెలుగులో ఎవరికీ పెద్దగా నమ్మకాల్లేవు. మైత్రీ మూవీస్ కూడా విడుదలకు ముందు పబ్లిసిటీ చేయలేదు. కానీ మౌత్ టాక్ తో ‘డ్రాగన్’ సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే మంచి వసూళ్లు సాధించింది. దాంతో ఇప్పుడు పబ్లిసిటీ చేసి.. ఈ సినిమా రన్ పెంచాలనుకొంటున్నారు. ఈ పబ్లిసిటీ ఏదో సినిమా విడుదలకు ముందు చేసుంటే ఇంకా బాగుండేది.