సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ కుమార్తెకు చెందిన బ్యాంక్ ఖాతా లావాదేవీలను ఏపీ ఏసీబీ అధికారులు అక్రమంగా సేకరించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతుతున్నాయి. హైదరాబాద్ ఆంధ్రాబ్యాంక్‌లో ఉన్న ఖాతాకు సంబంధించిన వివరాలను విజయవాడలోని బ్రాంచ్‌లో ఓపెన్ చేసి.. తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడంతో బ్యాంకులో అలాంటి డేటా ఇచ్చిన ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు. మొత్తం ఐదుగురు సస్పెండైన వారి జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం అత్యంత సీరియస్ కావడంతో.. పూర్తి విచారణ జరిపి.. మరింత కఠినమైన చర్యలు తీసుకుంటారని బ్యాంక్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఖాతాదారుకి సంబంధించిన వివరాలుగోప్యంగా ఉంచడం బ్యాంకు విధి. అయితే ఆంధ్రా బ్యాంక్ సిబ్బంది.. ఏపీ ఏసీబీ అధికారుల ఒత్తిడికి తలొగ్గినట్లుగా తెలుస్తోంది. రాజధాని భూముల కేసులకు సంబంధం లేకుండానే వాటికి సంబంధించిన విచారణ ఏదీ ప్రారంభం కాకుండానే… ఈ వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. మామూలుగా ఏసీబీ అధికారులు రాజధాని భూములపై కేసు నమోదు చేసి.. ఆ తర్వాత అనుమానాస్పద లావాదేవీలు ఉంటే.. వాటికి సంబంధించిన వివరాలు తీసుకుని ఉంటే.. అది వేరే విషయం. అసలు కేసు కూడా నమోదు కాక ముందే కుట్ర పూరితంగా ఇరికించాలన్న ఉద్దేశంతోనే బ్యాంక్ లావాదేవీల వివరాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఇది డేటా చోరీ కిందకు రావడంతో.. వ్యవహారం సీరియస్ అవుతోంది. పైగా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని టార్గెట్ చేసిన వ్యవహారంలో ఏసీబీ పరిధి దాటిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఏసీపీ పెద్దలు అడ్డంగా ఇరుక్కుపోవడం ఖాయమని కూడా చెబుతున్నారు. బ్యాంక్ ఉద్యోగులు సస్పెండ్ కావడం అంటే.. మామూలు విషయం కాదు. అది వారి ట్రాక్ రికార్డుల్లో ఉంటుంది. అందుకే.. వారికి మద్దతుగా సాక్షి పత్రిక కథనాలు కూడా రాస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగుల జీవితాలే రిస్క్‌లో పడ్డాయని.. ముందు ముందు ఏసీబీ అధికారులు బలవుతారని.. అధికారవర్గాల్లోనే జోరుగా ప్రచారం జరుగుతోంది.