తెలుగు360.కామ్ రేటింగ్ : 2.25/5
రొమాంటిక్ ప్రేమకథలో కల్యాణ్‌రామ్.
అందుకోసం కొత్త లుక్
ఆయనకి జోడీగా తమన్నా
పీసీ శ్రీరామ్ కెమెరా…
ఇది చాలదూ… సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడటానికి! ఆ ఆసక్తి అంచనాల స్థాయికి వెళ్లేలాగే టీజర్, ట్రైలర్లలో కల్యాణ్‌రామ్, తమన్నా జోడీ కనిపించింది. మోర్ మేజిక్, మోర్ లవ్ అనే క్యాప్షన్‌ని తగ్గట్టుగానే ఇందులో ఏదో మేజిక్ ఉండే ఉంటుందని ఆశపడ్డారు ప్రేక్షకులు. మరి అందుకు తగ్గట్టుగానే సినిమా ఉందో లేదో తెలుసుకొనే ముందు కథలోకి వెళదాం…
కథ
మీరా (తమన్నా) ఓ ఎఫ్.ఎమ్ స్టేషన్లో రేడియో జాకీ. డెస్టినీని బలంగా నమ్ముతుంటుంది. డెస్టినీవల్లే తాను పదే పదే వరుణ్ (కల్యాణ్‌రామ్)ని కలుసుకొంటున్నాననేది ఆమె భావన. వరుణ్ అమెరికాకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న పీహెచ్డీ విద్యార్థి. రెండుసార్లు తన ప్రయత్నం విఫలం కావడంతో, మూడోసారి విజయవంతంగా వీసాని పొంది అమెరికా ఫ్లైటెక్కే ప్రయత్నంలో ఉంటాడు. ఇంతలోనే అనుకోకుండా వరుణ్ని కలిసిన మీరా డెస్టెనీ ఇద్దరినీ కలుపుతున్న విషయం గురించి చెబుతుంది. డెస్టినీని పెద్దగా పట్టించుకోని వరుణ్ ఆమె మాటల్ని పట్టించుకోడు. కానీ మీరా చెప్పినట్టుగానే ఆమెని మళ్లీ కలుస్తాడు వరుణ్. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్ని డెస్టినీ ఎలా ప్రభావితం చేసింది? ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకొన్నాక వాళ్ల జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేదే మిగతా సినిమా.
విశ్లేషణ
తీస్తున్నది రొమాంటిక్ కథ కాబట్టి అందుకు తగ్గట్టుగానే మంచి జోడీని ఎంపిక చేసుకొన్నాడు దర్శకుడు…
కల్యాణ్‌రామ్‌ని లవర్‌బాయ్‌గా మార్చడంపైన కూడా మంచి కసరత్తులే చేశారు…
కెమిస్ట్రీ కోసమని హీరోహీరోయిన్లని కూడా బాగా ప్రిపేర్ చేశారు…
ప్రేమకథల్లో మేజిక్ కనిపించాలి కాబట్టి అందుకు తగ్గట్టుగానే సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసుకొన్నారు…
ఇన్ని చేసిన దర్శకుడు కథని మాత్రం పక్కాగా రాసుకోలేకపోయాడు. రాసుకొనే సన్నివేశాల నుంచే మొదట కెమిస్ట్రీ రావాలనే అసలు విషయాన్ని మరిచిపోయాడు. దాంతో నో మేజిక్, నో లవ్ అన్నట్టుగా సినిమా సాగుతుంది. తమన్నా పాత్ర, ఆమె కుటుంబం నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో మినహా ఎక్కడా వాస్తవికత కనిపించదు. పాత్రలన్నీ కూడా… కృతకంగా సినిమాకోసం కొని తెచ్చుకొన్న హావభావాలతోనే సాగుతాయి. దాంతో సినిమా ఏ కోశానా ఆకట్టుకోదు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా బిత్తిరి సత్తి చేసే హంగామా… ప్రేమికుడి కోసం రైల్వేస్టేషన్లోనే తిష్టవేసి ఎఫ్.ఎమ్.స్టేషన్‌ని నడిపే మీరా పాత్ర, ఎన్నిసార్లు అమెరికా ప్రయాణం ఆగిపోయినా నవ్వుకుంటూ తిరిగొచ్చే హీరో పాత్ర… ఇలా ఎందులోనూ వాస్తవికత కనిపించదు. డెస్టినీ అనే విషయాన్ని వాడిన విధానం కూడా సినిమాకి ఏమాత్రం అతకలేదు. డెస్టినీని ఒక సన్నివేశానికో, రెండు సన్నివేశాలకో పరిమితం చేయాలి. కానీ ప్రతిచోటా అదే ప్రస్తావనే. దాంతో డెస్టినీలోని మేజిక్కే ఇందులో కనిపించదు. కల్యాణ్‌రామ్, తమన్నా మధ్య కూడా గొప్ప కెమిస్ట్రీ ఏమీ పండలేదు. కాకపోతే కథ, కథనాల్లోనే లోపాలు కనిపిస్తుండడంతో వాళ్లపైన కంప్లైట్స్ చేసే ఆస్కారమే రాదు. సెకండ్‌హాఫ్‌లో డెస్టినీ పేరుతో సాగే హంగామా మరింత విసుగు తెప్పిస్తుంది. కాస్తలో కాస్త పతాక సన్నివేశాలే పర్వాలేదనిపిస్తాయి. పోసాని కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. పీసీ శ్రీరామ్ కెమెరా ప్లెజెంట్‌గా బంధించిన సన్నివేశాలే కాస్తలో కాస్త ప్రేక్షకుడికి ఊరట. అలాగే తమన్నా అందం కూడా ఆకట్టుకుంటుంది. మూడు పాటల్ని చాలా బాగా చిత్రీకరించారు.
నటీనటులు
తమన్నానే సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ఆమె అందంతో పాటు, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మంచి ప్రేమకథ కుదిరితే, తమన్నా అద్భుతమైన కెమిస్ట్రీ పండించగలదని ఈ చిత్రంతో మరోమారు రుజువు చేస్తుంది. కల్యాణ్‌రామ్ కూడా తాను రొమాంటిక్ కథలకీ సరిపోతాననే ఓ సంకేతాన్ని ఈసినిమాతో ఇస్తాడు. సినిమాలో ఆ ఇద్దరి పాత్రలు మినహా మరే పాత్రకీ ప్రాధాన్యం లేదు. పోసాని, ప్రియదర్శి, వెన్నెలకిషోర్ అక్కడక్కడా నవ్వించారంతే.
సాంకేతికత…
సినిమాకి శరత్ వాసుదేవన్ సంగీతం, పీసీ శ్రీరామ్ కెమెరా మేజిక్ ప్రధానబలం. సినిమా రెండు గంటలే ఉండేలా కట్ చేశాడు ఎడిటర్. అయినప్పటికీ సహనంతో చూడాల్సిన పరిస్థితి. నిర్మాణ విలువలు బాగున్నాయి. జయేంద్ర తనకి బాగా అలవాటైన యాడ్ పిల్మ్స్ తరహాలో ఈ చిత్రాన్ని తీశాడు. కథ, కథనాల విషయంలో ఆయన కసరత్తులు ఫలించలేదనిపిస్తుంది.
తీర్పు
ప్రేమకథలకి కెమిస్ట్రీ, మేజిక్కే కాదు… ఆత్మ కూడా అవసరమనే విషయాన్నే గట్టిగా చెబుతుందీ చిత్రం. కల్యాణ్‌రామ్, తమన్నా జోడీ… మంచి పాటల కోసమైతే ఒకసారి చూడొచ్చీ సినిమాని.
ఫైనల్ టచ్: `విధి` వైపరీత్యం
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.25/5