తెలుగు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి మలయాళంలో అక్కడి స్టార్ హీరోలతో పోటీ పడేంత మార్కెట్ వుంది. అతడి ప్రతి సినిమాను మలయాళంలో డబ్ చేస్తారు. లేటెస్ట్ ‘నా పేరు సూర్య’ను కూడా చేశారు. మలయాళంతో పాటు తమిళంలోనూ డబ్ చేసి, తెలుగులో విడుదల చేసిన రోజునే విడుదల చేశారు. హిందీలోనూ సేమ్ డే రిలీజ్ చేయాలనుకున్నారు. సెన్సార్ వర్క్స్ కంప్లీట్ కాకపోవడంతో హిందీ రిలీజ్ వాయిదా పడింది. త్వరలో హిందీ ప్రేక్షకుల ముందుకు ‘నా పేరు సూర్య’ను తీసుకువెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే… స్పానిష్, చైనీస్ లాంగ్వేజెస్‌లో ఈ సినిమాని డబ్ చేస్తామని నిర్మాత లగడపాటి శ్రీధర్ తెలిపారు.
“అమెరికాలో ‘ఐయామ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో’ సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు హాలీవుడ్ నిర్మాత జిమ్ అనే అతన్ని కలిశా. ఇండియా-చైనీస్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక డ్యాన్స్ బేస్డ్ మ్యూజికల్ మూవీ తీయాలనుంది. మీరు సపోర్ట్ చేస్తారా? అని అతను అడిగాడు. ‘అల్లు అర్జున్ వాన్నాఫ్ ది బెస్ట్ డ్యాన్సర్’ అని అతనితో చెప్పా. వాళ్లు స్క్రిప్ట్ పంపారు. బన్నీకి కథను పంపే ముందు వాళ్లను ‘నా పేరు సూర్య సినిమా’ను చూడమని చెప్పా. అమెరికాలో వాళ్లు సినిమా చూశారు. వాట్సాప్ మెసేజ్ చేశారు. స్పానిష్, చైనీస్లతో పాటు పలు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లో సినిమాను విడుదల చేస్తామనీ, రైట్స్ కావాలనీ అడిగారు. ఇంతకు ముందు ‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమాలను చైనాలో విడుదల చేసిన అనుభవం వారికి వుంది. అక్కడ ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలో వెల్లడిస్తాం” అని లగడపాటి శ్రీధర్ తెలిపారు.