శంకర్ సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చేవి పాటలే. శంకర్ విజువల్ సెన్స్‌కి పాటలే నిదర్శనం. ప్రతీ సినిమాలోనూ గుర్తుండిపోయేలా కనీసం ఒక్క పాటైనా డిజైన్ చేస్తారు. గేమ్ ఛేంజర్‌లోనూ ఇలాంటి పాటలుంటాయని ఆశించారు అభిమానులు. చిత్రబృందం కూడా పాటల గురించి మాగొప్పగా చెప్పింది. కేవలం పాటలకే 75 కోట్లు ఖర్చు పెట్టామని స్వయంగా దిల్ రాజు ప్రకటించారు. జరగండి పాట జస్ట్ యావరేజ్ గా అనిపించింది. ధూప్… పాట కూడా అంతే. కలర్స్, చరణ్ వేసిన స్టెప్పుల వల్ల ఆ పాట నిలబడింది.
అయితే ఆల్బమ్‌లోని ‘నానా హైరానా’ పాట థియేటర్లో కనిపించలేదు. సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగిందని, 14 నుంచి పాటని జోడిస్తామని చిత్రబృందం ప్రకటించింది. పాట లేదన్న విషయం రిలీజ్ రోజు వరకూ దాచి ఉంచడం, ఆ తరవాత జోడిస్తామని చెప్పడం దిల్ రాజు మాస్టర్ మైండ్ కి నిదర్శనం. 14 నుంచి ఈ పాట కోసం మళ్లీ వస్తారులే.. అని దిల్ రాజు భావిస్తే కేవలం అది ఆయన పొరపాటే అవుతుంది. జోడించిన పాటల కోసమో, సీన్ల కోసమో మళ్లీ మళ్లీ జనాలు థియేటర్లకు వెళ్తారనుకోవడం పొరపాటే. ఈరోజుల్లో ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. సినిమా ఎలాగూ నెల రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుంది. సినిమానే ప్రేక్షకులు లైట్ తీసుకొంటే, ఇక పాటల కోసం ప్రత్యేకంగా ఎందుకు వెళ్తారు? అందులోనూ ఈ పాటలో కొంత భాగాన్ని లిరికల్ వీడియో పేరిట చూసేశారు కూడా.
పైగా పాటలకు ఈ సినిమాలో సరైన ప్లేస్ మెంట్ దొరకలేదు. ఇప్పుడు ఈ పాట జోడించాలన్నా సరైన ప్లేస్ మెంట్ వెదకాలి. ‘నానా హైరానా పాట లేదేంటి’ అంటూ థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడు బాధ పడలేదు. మరో ఐదు నిమిషాల టైమ్ తగ్గిందిలే అని సంతృప్తి పడిపోయాడు. పాట ఉండి ఉంటే.. టికెట్ రేటు ఇంకాస్త గిట్టుబాటు అయ్యేది అంతే.