తెలుగు సినిమా కల ‘ఆస్కార్’ ఫలించడానికి ‘ఆర్.ఆర్.ఆర్’ ఒక్క అడుగు దూరంలో ఉంది. బెస్ట్ వర్జినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట నామినేట్ అయ్యింది. షార్ట్ లిస్టులో చోటు చేసుకొన్న పాటల్ని మళ్లీ ఒడబోసి.. నాలుగు పాటలతో తుది జాబితా సిద్ధం చేసింది ఆస్కార్. ఆ నాలుగు పాటల్లో… ‘నాటు నాటు’కు చోటు దక్కింది. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సైతం నాటు నాటు పాట దక్కించుకొన్న సంగతి తెలిసిందే. గోల్డెన్ గ్లోమ్ మినీ ఆస్కార్ లాంటిది. అక్కడ అవార్డు గెలుచుకొన్న పాటలకు ఆస్కార్ రావడం దాదాపుగా గ్యారెంటీ. అందుకే ఆస్కార్ నామినేషన్లలో నాటు నాటుకి చోటు దొరుకుతుందని అంతా ఆశించారు. అనుకొన్నట్టే.. ఆస్కార్ కమిటీ నాటు నాటు పాటని నామినేషన్లలో ఎంపిక చేసింది. మార్చి 23న జరిగే అవార్డు ప్రదానోత్సవంలో విజేత ఎవరో తెలిసిపోతుంది. కీరవాణి స్వరపరిచిన ఈ గీతాన్ని చంద్రబోస్ రాశారు. ప్రేమ్ రక్షిత్ నృత్య రీతులు సమకూర్చారు.
* ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ
ఆస్కార్‌లో ఉత్తమ నటుడి పురస్కారం కోసం ఎన్టీఆర్ సైతం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. నామినేషన్లలో ఎన్టీఆర్ పేరు తప్పకుండా ఉంటుందని అంతా భావించారు. అయితే… నామినేషన్లకు ఎన్టీఆర్ అర్హత సాధించలేకపోయాడు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు కేటగిరిలలో కూడా `ఆర్.ఆర్.ఆర్`కి చోటు దక్కలేదు. నాటు నాటు పాట తుది జాబితాలో నిలవడం ఒక్కటే తెలుగు వాళ్లుగా గర్వించదగిన విషయం. ఆ ఆస్కార్ కూడా అందేస్తే… ఆర్.ఆర్.ఆర్ పేరు మరోసారి మార్మోగిపోవడం ఖాయం.