అరుణాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభానికి సుప్రీం కోర్టు నిన్న తెర దించుతూ తీర్పు చెప్పిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి నబం తుకి క్షణం ఆలశ్యం చేయకుండా డిల్లీలోని అరుణాచల్ ప్రదేశ్ భవన్ లో మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఉదయం ఆయన రాష్ట్రానికి చేరుకొన్న వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలని తన కార్యాలయానికి పిలిపించుకొని వారితో తన ప్రభుత్వ కార్యాక్రమాల గురించి మాట్లాడారు.
సుప్రీం కోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన కలికో పౌల్ మీడియాతో మాట్లాడుతూ, “సుప్రీం కోర్టు గవర్నర్ నిర్ణయాల ఆధారంగానే ఈ తీర్పు వెలువరించింది. అయితే ఆ తరువాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలని, సమీకరణాలలో మార్పులని పరిగణనలోకి తీసుకోలేదు. ఏ ప్రభుత్వ మనుగడ అయిన దానికి ఉండే ఎమ్మెల్యేల సంఖ్య మీదే ఆధారపడి ఉంటుందని అందరికీ తెలుసు. 60 మంది సభ్యులున్న శాసనసభలో నాకు 43మంది మద్దతు ఉంటే, ఆయనకి (నబం తుకి) కేవలం 15మంది మాత్రమే మద్దతు ఇస్తున్నారు. కనుక శాసనసభలో మళ్ళీ బలపరీక్ష జరిగినప్పుడు మేమే గెలుస్తాము కనుక మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం,” అని చెప్పారు.
దీనిని బట్టి అర్ధం అవుతున్నదేమిటంటే సుప్రీం కోర్టు తీర్పుతో నబం తుకి మళ్ళీ అధికారం దక్కించుకొన్నా దానిని ఆయన నిలబెట్టుకోవడం చాలా కష్టమని! అంటే ఆయన అధికారం తాత్కాలికమేనని స్పష్టం అవుతోంది. శాసనసభలో మళ్ళీ బలపరీక్ష జరపడం అనివార్యం కనుక మళ్ళీ ఎమ్మెల్యేల బేరసారాలు చేయకతప్పదు. అయితే భాజపా అండ ఉన్న ఎమ్మెల్యేలని తనవైపు తిప్పుకోవడం సాధ్యం కాదు కనుక ప్రత్యర్దులకి కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా చేయడం కోసం తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించమని తాత్కాలిక గవర్నర్ తతగత రాయ్ ని ముఖ్యమంత్రి కోరినా ఆశ్చర్యం లేదు. కానీ కేంద్రప్రభుత్వం ప్రతినిధిగా వ్యవహరించే గవర్నర్ ఆ అభ్యర్ధనని మన్నించకపోవచ్చు. అప్పుడు మళ్ళీ మరోసారి న్యాయపోరాటం మొదలయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ నబం తుకి శాసనసభలో తన బలం నిరూపించుకోవడానికి సిద్దపడినట్లయితే, ఏ సమస్యా ఉండదు. సాఫీగా మళ్ళీ అధికార మార్పిడి జరిగిపోతుంది.