జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి తేరుకొని, వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని, పోలిట్బ్యూరో ని ప్రకటించింది. పోలిట్ బ్యూరో లో నలుగురు సభ్యుల కు చోటు దొరికితే, పొలిటికల్ అఫైర్స్ కమిటీ లో 12 మంది సభ్యులకు చోటు దక్కింది. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీకి చైర్మన్ గా నియమితులు కావడమే కాకుండా, పోలిట్ బ్యూరో లో కూడా చోటు దక్కించుకున్నారు. దీంతో పార్టీలో నాదెండ్ల మనోహర్ కీలక భూమిక పోషించనున్నట్టుగా అర్థమవుతోంది.
పోలిట్ బ్యూరో లో నాదెండ్ల మనోహర్ తో పాటు, పి రామ్మోహన్ రావు, రాజు రవితేజ, అర్హం ఖాన్ లకు చోటు దక్కితే, నాదెండ్ల మనోహర్ చైర్మన్ గా వ్యవహరించనున్న పొలిటికల్ ఫైర్స్ కమిటీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, తోట చంద్రశేఖర్ లతో పాటు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కి కూడా చోటు దక్కింది. అయితే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కు చోటు దక్కకపోవడం గమనార్హం.
ఏదేమైనా నాదెండ్ల మనోహర్ కి కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా జనసేన పార్టీ తన మీద ఎటువంటి కుల ముద్ర పడకుండా చూసుకుందని ఆ పార్టీ అభిమానులు అంటున్నారు.