జనసేన పార్టీకి మహరాజ పోషకులుగా అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నెంబర్ టు స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహరే అంటున్నారు. తమ సంపాదన నుంచి కోట్లకు కోట్లు వీరు పార్టీ కోసం విరాళంగా ఇస్తున్నారు. నాదెండ్ల మనోహర్ ఏకంగా రూ. కోటి చెక్కును పవన్ కల్యాణ్ చేతుల మీదుగా.. కోశాధికారికి ఇప్పించారు. ఈ కోటి రూపాయలను .. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా అందిస్తున్న ప్రమాద బీమా కార్యక్రమానికి వినియోగిస్తారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం జోరుగా సాగుతోంది. ఏపీతో పాటు తెలంగాణలోనూ జరుగుతోంది.
జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇందు కోసం ఇన్సూరెన్స్ కంపెనీలకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంది. సభ్యత్వ రుసుము కూడా దీనికి సరిపోదు. అందుకే .. పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తన వంతుగా రూ.కోటి విరాళం ఇచ్చారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని నడపడానికి అవసరమైన మొత్తాన్ని రూ. కోట్లలో సర్దుబాటు చేస్తున్నారు. ఇటీవల అన్ని జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సొంత డబ్బులను పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున ఏ జిల్లాకు వెళ్లినా రెండు వందల మందికి తక్కువ కాకుండా చెక్కులు పంపిణీ చేశారు.
జసనేన పార్టీకి ఇంకా కార్పొరేట్లు విరాళాలు ఇవ్వడం లేదు. ఎలక్టోరల్ బాండ్లు వంటి వాటి ద్వారా నిధులు అందడం లేదు. పవన్ కల్యాణ్ సంపాదనతో పాటు ఆయనకు సన్నిహితులు జనసేన అభిమానులు మాత్రమే విరాళాలిస్తున్నారు. అవిపార్టీ నడపడానికి ఏ మాత్రం సరిపోవడం లేదు. అయినప్పటికీ పవన్ కల్యాణ్.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తల సంక్షేమానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.