ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన స్మార్ట్ సర్వే కార్యక్రమంపై మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ‘అసలు ఇంత హటాత్తుగా సర్వే నిర్వహించవలసిన అవసరం ఏమిటి?’ అని ప్రశ్నించారు. ఈ సర్వేలో ప్రజల వ్యక్తిగత వివరాలని సేకరించడమే కాకుండా వారి సామాజిక, ఆర్ధిక వివరాలను రాబట్టేందుకు 25 రకాల ధ్రువపత్రాలని సేకరిస్తున్నారని మనోహర్ ఆరోపించారు. వాటిని సేకరించవలసిన అవసరం ఏమిటి? ప్రభుత్వం వాటిని ఎందుకు సేకరిస్తోంది? ఆ సర్వే వివరాలు ఆధారంగా ప్రభుత్వ పధకాల భారాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోందా? అని మనోహర్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సేకరిస్తున్న ఈ వివరాలు సంఘ విద్రోహుల చేతిలో పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటువంటి సర్వే నివేదికల ఆధారంగా ప్రభుత్వాలు ప్రజావసరాలకి తగిన విధంగా ప్రణాళికలు రూపొందించుకొంటామని, ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హులైన వారికి చేర్చేందుకు ఉపయోగపడతాయని చెప్పుకొంటుంటాయి. అది నిజమే అయినప్పటికీ, సర్వేలతో వేరే ప్రయోజనం కూడా ఆశిస్తుంటాయి. ప్రధానంగా రాష్ట్రంలో వివిధ కులాలు, మతాల జనాభా ఎంతుంది? వారి ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిస్థితి ఏమిటి? బోగస్ తెల్ల రేషన్ కార్డులు వగైరాలని గుర్తించి ఏరివేయడం, ప్రభుత్వ సంక్షేమ పధకాల దుర్వినియోగాన్ని తగ్గించుకొని ఖజానాపై ఆర్దికభారం తగ్గించుకోవడం వంటి అనేక కారణాలు ఉంటాయి.
ఈ స్మార్ట్ సర్వే ద్వారా రాష్ర్టంలో అగ్ర కులాలో నిరుపేదలని గుర్తించి వారికి కూడా సంక్షేమ పధకాలని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సర్వే వలన అటువంటి మంచి ఫలితాలు కూడా ఉండవచ్చు. కనుక దానిని పూర్తిగా తప్పు పట్టడానికి లేదు.
అయితే ఈవిధంగా వేర్వేరు అవసరాలని దృష్టిలో పెట్టుకొని పదేపదే సర్వేలు నిర్వహించడం వలన ప్రభుత్వానికి చాలా వ్యయప్రయాసలు తప్పవు. కనుక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే, మళ్ళీ ఎన్నికలకి వెళ్ళే ముందు సమగ్ర సర్వేలు నిర్వహిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అలాగే ఆ వివరాలని అన్నిటినీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తున్నట్లయితే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. దానినే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్ సర్వేపై నాదెండ్ల మనోహార్ వ్యక్తం చేసిన అనుమానాలకి ప్రభుత్వం తరపున ఎవరైనా అధికారికంగా సమాధానం చెపితే బాగుంటుంది.