ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల కోసం కార్పొరేషన్లను అనువుగా ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికి ఎన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారో లెక్కే లేదు. రాష్ట అభివృద్ధి కార్పొరేషన్ అంటారు… మెడికల్ కాలేజీల కార్పొరేషన్ అంటారు… ప్రాజెక్టుల కార్పొరేషన్ అంటారు… ఎడ్యుకేషన్ కార్పొరేషన్ అంటారు.. ఇలా ఎన్నో కార్పొరే్షన్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటికి ప్రభుత్వ ఆస్తులను బదలాయించి… వాటిని తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. దీనిపై విపక్షాలు ఇప్పుడు కొత్త రకం విమర్శలు చేస్తున్నాయి. జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ వాటిని సూట్‌కేస్ కార్పొరేషన్లుగా వ్యవహరించడం ప్రారంభించారు. జగన్ అక్రమాస్తుల కేసులో సూట్ కేస్ కంపెనీలు అత్యంత కీలకంగా ఉన్నాయి.
అంటే పేపర్ల మీదే ఉండే కంపెనీలు. కేవలం లావాదేవీలు చూపించి… పెట్టబుడులను దొంగ దారుల్లో మళ్లించి.. వాటి ద్వారా సొంత కంపెనీల్లోకి నిధుల ప్రవాహాన్ని చేర్చుకోవడానికి ఉపయోగించే వాటిని సూట్ కేసు కంపెనీలు అంటారు. వైసీపీ ఎంపీగా మారిన ఆడిటర్ విజయసాయిరెడ్డి ఇలాంటి వ్యవహారాల్లో ఆరితేరిపోయారని రాజకీయవర్గాల్లో విమర్శలు వస్తూంటాయి. ఆయన పెట్టిన కంపెనీలు.. పెట్టించిన కంపెనీలు అన్నీ ఇలాంటి బాపతువేనని విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ తరహాలోనే ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్లపైనా విమర్శలు ప్రారంభమయ్యాయి. అవి సూట్‌కేసు కార్పొరేషన్లు అని విమర్శించడం ప్రారంభించారు.
నిజానికి ప్రభుత్వం పెడుతున్న కార్పొరేషన్ల లావాదేవీల వ్యవహారాలు చూస్తే.. వాటిని నిజంగానే సూట్ కేసు కార్పొరేషన్లుగా తేల్చాల్సి ఉంటుందని అర్థిక నిపుణులు చెబుతున్నారు.ఈ అంశం ఆధారంగానే జనసేన నేత నాదెండ్ల మనోహర్.. సూట్ కేసు కార్పొరేషన్ల అంశాన్ని హైలెట్ చేస్తున్నారు . ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై దృష్టి పెట్టిందని ప్రచారం జరుగుతున్న సమయంలో… ఈ కార్పొరేషన్ల అంశాన్ని హైలెట్ చేయడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. వాటికి క్యాచింగ్ పాయింట్‌గా సూట్ కేస్ కార్పొరేషన్ల అస్త్రం లభించినట్లయింది.