జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ పై కొంత కాలంగా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనా ఆయన పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. పార్టీలోని చోటా నేతలు తమ ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయనపై అలుగుతున్నారు. ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వడం.. తమను పట్టించుకోకపోవడం వల్ల ఆయన కోవర్టు అంటూ ప్రచారం చేస్తున్నారు. కొంత కాలంగా ఇది మరీ ఎక్కువ అయింది. సొంత పార్టీ సోషల్ మీడియా సైనికులు కూడా ఇలాగే చేస్తూండటంతో పవన్ కల్యాణ్ రెస్పాండ్ అయ్యారు. నాదెండ్ల మనోహర్ కు అండగా నిలిచారు.
నాదెండ్ల మనోహర్ పార్టీ కోసం బలంగా నిలిచిన నేత అని ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని పవన్ కల్యాణ్ నేరుగానే హెచ్చరించారు. దీంతో నాదెండ్ల సంతృప్తి చెంది ఉంటారు కానీ..ఆయన తీరుపై అసంతృప్తికి గురైన చోటా నేతలు మాత్రం.. తమ ప్రచారాన్ని ఆపాలని అనుకోవడం లేదు. నాదెండ్ల మనోహర్ ను పార్టీ నుంచి బయటకు పంపాలని ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే పవన్ సినిమాల్లో బిజీ అయిన నాలుగేళ్లలో పార్టీ ఉనికి కాపాడిన నేత నాదెండ్ల మనోహర్. నాగబాబు కూడా పూర్తిగా తిరగలేని పరిస్థితుల్లో అన్ని జిల్లాల్లోనూ నాదెండ్ల తిరిగేవారు. వీలైనంత వరకూ జనసైనికుల్ని సమన్వయం చేసుకునేవారు. కారణం ఏమిటో కానీ ఇటీవల ఆయనకు ప్రాధాన్యత తగ్గుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నాగబాబుకు ప్రధాన కారక్యదర్శి పదవి ఇవ్వడంతో ఆయనే ఫీల్డ్ విజిట్స్ ప్రారంభించడంతో నాదెండ్ల ఇక తెర వెనుక పనులకు పరిమితమవుతారన్న చర్చ జరుగుతోంది.