కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు హైదరాబాద్ రాబోతున్న సంగతి తెలిసిందే. ముందుగా, నగర శివారుల్లోని గిరిజన తండాకి వెళ్తారు. అక్కడో గిరిజనుడి ఇంటికి వెళ్లి అల్పాహారం చేస్తారు. ఆ తరువాత, శంషాబాద్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేరోజు రాత్రి పలువురు నేతలతో అమిత్ షా భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెంది కొంతమంది ప్రముఖులు కూడా ఆయన్ని కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కూడా అమిత్ షాతో భేటీ కాబోతున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది.
ప్రస్తుతానికి ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నారు. అమిత్ షాతో భేటీ వెనక ఆలోచన ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి, ఆంధ్రా రాజకీయాలపై భాస్కరరావు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీ మీద, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా, జగన్ సర్కారు మీద కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ పాలన ఒక నెల పూర్తయిన సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ… జగన్ ఇచ్చిన హామీలు చూస్తుంటే తనకు భయం వేస్తోందన్నారు. అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి కింద నగదు ఇస్తామనడం బాగుందిగానీ, ఇవన్నీ అమలు చేయడానికి కావాల్సిన నిధులు ఎక్కణ్నుంచి వస్తాయో జగన్ చెప్పడం లేదన్నారు.
భాజపాకి కావాల్సింది ఇలాంటి వాయిసే కదా! తెలుగుదేశం పార్టీ మీద బాగా విమర్శలు చెయ్యగలరు. వైకాపా మీద కూడా ఇలాంటి కామెంట్లు చెయ్యగలరు. పైగా ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఒకవేళ ఆయన ఇప్పుడు భాజపాలో చేరినా క్రియాశీలంగా అంటే, ఆ పార్టీ తరఫున బాగా మాట్లాడగలిగే సీనియర్ నాయకుడిగా మాత్రమే ఉండగలరు. ఇలాంటివారు కూడా పార్టీలో ఉంటే కొంత సమతౌల్యం వస్తుందని భాజపా భావిస్తున్నట్టుగా ఉందేమో చూడాలి. ఏదేమైనా, అమిత్ షాను ఆయన కలవబోతున్నారంటూ కథనాలు రావడం కొంత ఆసక్తికరంగానే మారింది. కుమారుడు జనసేనలో ఉంటే, తండ్రి భాజపాకి అనుకూలంగా వ్యవహరిస్తారా..?