అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో… ఇలా విభిన్నమైన కథల్ని ఎంచుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాడు శ్రీవిష్ణు. మెంటల్ మదిలో సినిమాతో కమర్షియల్ హిట్ కూడా అందుకున్నాడు. ఇప్పుడు తన నుంచి మరో సినిమా వస్తోంది. అదే నాదీ నీదీ ఒకే కథ. ఓ కొత్త జోనర్లో సాగే కమర్షియల్ సినిమా అని తెలుస్తోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మాతలు. ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేశారు. శ్రీ విష్ణు మూడు గెటప్పుల్లో కనిపిస్తున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా పుస్తకాల్ని తగలబెడుతున్నట్టుగా పోస్టర్ని డిజైన్ చేయడం ఆకట్టుకుంది. విజయానికి ఆరుమెట్లు, విజయానికి ఒక మెట్టు, గెలుపు గుర్రాలు అనే పుస్తకాలు మంటల్లో కాలిపోతున్నట్టు పోస్టర్ డిజైన్ చేశారు. విజయానికి ఆరు మెట్లు, డేగరెక్కల చప్పుడు అనేవి యండమూరి వీరేంధ్రనాథ్ పుస్తకాలు. వాటిని సింబాలిక్‌గా చూపిస్తున్నట్టుంది పోస్టర్. వ్యక్తిత్వ వికాస పుస్తకాల్ని తగలబెట్టడం వెనుక… పెద్ద కథే ఉన్నట్టు అర్థం అవుతోంది. మానసిక సంఘర్షణలతో కూడిన ఓ వాస్తవిక కథని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ”మెంటల్ మదిలో కంటే.. ఇష్టపడి చేసిన సినిమా నీదీ నాదీ ఒకే కథ. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అంటూ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడు శ్రీవిష్ణు. మరి ఏం జరుగుతుందో చూడాలి.