‘కల్కి 2’ గురించి నిర్మాత అశ్వనీదత్ వెర్షన్ ఒకలా ఉంటే, దర్శకుడు నాగ్ అశ్విన్ వెర్షన్ మరోలా ఉంది. ‘కల్కి 2’కి సంబంధించిన షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయ్యిందని, మేజర్ ఎపిసోడ్స్ చాలానే తెరకెక్కించామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అశ్వనీదత్. దాంతో ‘కల్కి 2’ వీలైనంత త్వరగానే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా ఆశించారు. అయితే ‘కల్కి 2’ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ వెర్షన్ మరోలా ఉంది. ఈ సినిమా కోసం 20 రోజులే షూటింగ్ చేశామని, తీయాల్సిన సినిమా చాలా ఉందని, విడుదల తేదీ విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదని క్లారిటీగా చెప్పేశారు నాగ్ అశ్విన్. 20 రోజుల్లోనే 40 శాతం షూటింగ్ పూర్తి చేయడం అసాధ్యం కాబట్టి.. అశ్వనీదత్ మాటల్ని ఇప్పుడు లైట్ గా తీసుకొంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. దాంతో 2025లో ‘కల్కి’ రాదన్న విషయం తేలిపోయింది. 2026లో పార్ట్ 2 ఉండొచ్చు.
పార్ట్ 2 గురించిన కథేమిటి? అనే విషయంలో నాగ్ అశ్విన్ దగ్గర ఓ స్పష్టత ఉంది. కానీ స్క్రిప్టు పనులే ఇంకా పూర్తి కాలేదు. ‘కల్కి 2’లో మూడు విభిన్న ప్రపంచాల్ని చూపించాడు నాగ్ అశ్విన్. `కల్కి 2`లోనూ అవే చూపిస్తానంటే కుదరదు. అందుకోసం మరో ప్రపంచాన్ని సృష్టించాలి. నాగ్ అశ్విన్ ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు. అశ్వద్దామని ఎదిరించి, సుమతిని తీసుకొని భైరవ వెళ్లిపోవడంతో ‘కల్కి 1’ ముగిసింది. బుజ్జి భైవరని ఎక్కడికి తీసుకెళ్లింది? అక్కడి ప్రపంచం ఎలా ఉంది? అనే సన్నివేశంతో ‘కల్కి2’ మొదలుకానుంది. ఆ ప్రపంచాన్ని ఇప్పుడు నాగ్ అశ్విన్ కొత్తగా చూపించబోతున్నాడట. `కల్కి2`లో నాగ్ అశ్విన్ చూపించబోతున్న 4వ సెటప్ ఇదే. ఇప్పుడు ఈ వరల్డ్ ని బిల్డ్ చేసే పనిలో నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నాడు. మరోవైపు స్క్రిప్టు పనులు పూర్తి కావల్సివుంది. ప్రభాస్ కూడా మిగిలిన సినిమాలకు కాల్షీట్లు ఇచ్చేశాడు. ఎటు చూసినా మరో రెండు నెలల వరకూ ‘కల్కి 2’ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.