నాగ్ అశ్విన్… బక్క పల్చగా ఉంటాడు. సింపుల్‌గా కనిపిస్తాడు. తక్కువ మాట్లాడతాడు. హడావుడి లేని జీవితం. అతన్ని చూస్తే… ‘మహానటి లాంటి కళాఖండం తీసింది ఇతనేనా’ అనిపిస్తుంది. ‘కల్కి’లాంటి భారీ బడ్జెట్ తీసింది ఈ మనిషేనా అని ఆశ్చర్యం వేస్తుంది. చిత్రసీమకు వచ్చి ఈ రోజుతో సరిగ్గా పదేళ్లయ్యింది. దశాబ్దకాలం అంటే చెప్పుకోదగ్గ సమయమే. అయితే ఈ కాలంలో తాను తీసింది మూడంటే మూడే సినిమాలు. అయితేనేం… తనదంటూ ఓ మార్క్ క్రియేట్ చేయగలిగాడు.
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో అరంగేట్రం చేశాడు నాగ్ అశ్విన్. నాని – విజయ్‌దేవరకొండ హీరోలు. అదో హ్యూమన్ ఎమోషన్ డ్రామా. నాగ్ అశ్విన్ లో ఉన్న సున్నితత్వం, మనిషిని చూసే కోణం ఎలాంటిదో చెప్పే సినిమా. టాలీవుడ్ కి ఓ సెన్సిబుల్ డైరెక్టర్ వచ్చాడన్న నమ్మకాన్ని కలిగించిన సినిమా. ఆ తరవాత ‘మహానటి’. అదో అద్భుతం అంతే. బయోపిక్ ఎలా తీయాలో.. నేర్పించేశాడు ఆ సినిమాతో. క్యారెక్టర్లని ఎంచుకొన్న విధానం దగ్గర్నుంచి, ఆ డ్రామా పండించే పద్ధతి వరకూ… ప్రతీ చోటా, ప్రతీ విషయంలోనూ నూటికి నూరు మార్కులు సంపాదించుకొన్నాడు. తెలుగు చిత్రసీమ ఎప్పటికీ గర్వంగా చెప్పుకొనే సినిమా తీయగలిగాడు. ఆ సినిమా కోసం నాగ్ అశ్విన్ చేసిన రీసెర్చ్ వర్క్ అంతా ఇంతా కాదు. ఆ ఓపిక, ప్లానింగ్ గొప్ప ఫలితాన్ని తీసుకొచ్చాయి. సాధారణంగా ఓ బయోపిక్ నెత్తిమీద పెట్టుకొంటే అది పూర్తయి బయటకు వచ్చేటప్పటికి ఎన్నో విమర్శలు, వివాదాలూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ చిన్న లోపం కూడా లేకుండా, ఎవరితో ఒక్క మాట కూడా అనిపించుకోనివ్వకుండా ‘మహానటి’ని ప్రేక్షకులకు అందివ్వగలిగాడు. ఈ సినిమాతో తానెంత సిన్సియరో అర్థమైంది.
ఆ తరవాత ‘కల్కి’ది మరో దారి. అసలు ఇలాంటి కథని ఎంచుకోవడమే కత్తి మీద సాము. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారంటే… అదంతా నాగ్ అశ్విన్‌పై ఉన్న నమ్మకమే. ‘కల్కి’తో తెలుగు సినిమా మరింత వికసించింది. తన విజన్, ఇంటెన్సిటీ తెలిసొచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా వైజయంతీ మూవీస్‌కు గత వైభవాన్ని అందివ్వగలిగింది. చిత్రసీమలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న సంస్థ వైజయంతీ. ఆ సంస్థకు సరైన సమయంలో.. వెన్నుదన్నుగా నిలిచాడు నాగ్ అశ్విన్.
ఇప్పుడు తన దృష్టంతా ‘కల్కి 2’పైనే ఉంది. ‘కల్కి’ కంటే గొప్పగా ఈ సినిమాను తీర్చిదిద్దాలన్న తపన తనలో కనిపిస్తోంది. `కల్కి 2`తో పాటు మరిన్ని కొత్త కథలు అందించాలన్నది తన ధ్యేయం. నాగ్ అశ్విన్ ఈతరం దర్శకుల్లా.. 30, 40 సినిమాలు తీయకపోవొచ్చు. మూడేళ్లకో సినిమా, పదేళ్లకు మూడు సినిమాలు అంటూ నత్తనడక ప్రయాణం కొనసాగించొచ్చు. కానీ తన దగ్గర్నుంచి ఎప్పుడు ఓ సినిమా వచ్చినా తెలుగు పరిశ్రమే కాదు, యావత్ భారతీయ చిత్రసీమ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. అది నాగ్ అశ్విన్ సినిమా కాబట్టి. అది తాను సంపాదించుకొన్న నమ్మకం.