‘మహానటి’ తరవాత… మరో సినిమా మొదలెట్టలేదు నాగ అశ్విన్. ప్రభాస్ తో ఓ సినిమా ఓకే చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ లో దాదాపు 300 కోట్లతో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ప్రస్తుతం నాగ అశ్విన్ ఆ పనుల్లోనే ఉన్నాడు. నిజానికి ఈ యేడాదే ఈసినిమాని లాంఛనంగా మొదలెట్టాలని, 2021లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలన్నది ప్లాన్. `రాధే శ్యామ్` తరవాత… నాగ అశ్విన్ సినిమానే మొదలవ్వాలి. అందుకే.. హీరోయిన్ గా దీపికా పదుకొణెని కూడా ఫిక్స్ చేసేశారు.
కానీ సడన్ గా ‘ఆది పురుష్’ ప్రాజెక్టు మధ్యలోకి వచ్చేసింది. `రాధే శ్యామ్` తరవాత ఆది పురుష్నే మొదలెట్టాలని ప్రభాస్ ఫిక్సయ్యాడు. ప్రభాస్ అనుకుంటే తిరుగేముంది? అందుకే… నాగ అశ్విన్ సినిమా కాస్త వెనక్కి వెళ్లింది. ఇప్పుడు మళ్లీ… ఈ రెండు సినిమాల మధ్య ప్రశాంత్ నీల్ వచ్చి చేరాడు. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాని మొదలెట్టాలని ప్రభాస్ భావిస్తున్నాడట. అన్నీ కుదిరితే.. `ఆది పురుష్` కంటే ముందుగానే ఈసినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడట. అదే జరిగితే నాగ అశ్విన్ సినిమా మరింత ఆలస్యం అవ్వడం ఖాయం. అయితే నాగ్ అశ్విన్ ప్రభాస్ కోసం ఎదురు చూస్తాడా? ఈలోగా మరో చిన్న సినిమాని పూర్తి చేసుకుంటాడా? అనే సందేహం వ్యక్తం అవుతుంది. నాగ అశ్విన్ దగ్గర కొన్ని కథలు రెడీగా ఉన్నాయి. `ఎవడే సుబ్రహ్మణ్యం` టైపులోనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలున్నాయి. వాటిలో ఒక కథని నాగ అశ్విన్ మొదలెట్టెచ్చు. కాకపోతే.. సినిమా సినిమా మధ్యలో విరామం తీసుకోవడం అశ్విన్‌కి అలవాటే. ఇన్నేళ్ల కెరీర్లో ఇప్పటి వరకూ రెండంటే రెండే సినిమాలు తీశాడు. ప్రభాస్ సినిమా కోసం ఎదురుచూడాల్సివచ్చినా – అశ్విన్ కంగారు పడడు. తన స్క్రిప్టుపై మరింత ఫోకస్ చేసుకునే టైమ్ దొరుకుతుంది. పైగా ప్రభాస్ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ అంతర్జాతీయ నిపుణులతో కలిసి చేసుకుంటున్నాడు నాగ అశ్విన్. ఈలోగా గ్యాప్ వచ్చిందని, మరో సినిమాపై ఫోకస్ పెట్టేరకం కూడా కాదు. కాబట్టి.. ప్రభాస్ కోసం అశ్విన్ ఎదురుచూసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభాస్ తరవాత ఎవరితో చేస్తాడు? అనే విషయాలేం పట్టించుకోకుండా.. అశ్విన్ తన ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.