వైజయంతీ మూవీస్ కలల చిత్రం ‘కల్కి’ మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అసలు ఈ కల్కి ఎలాంటి కథ? సైన్స్ ఫిక్షనా, మైథాలజీనా, ఫాంటసీనా… ఇలా రకరకాల ప్రశ్నలు. పాత్రలు, వాటి పేర్లుమాత్రం పురాణాల్ని తలపిస్తోంటే, తెరపై వాటి రూపాలు, విజువల్స్ మాత్రం సైన్స్ ఫిక్షన్లా అనిపిస్తున్నాయి. అసలు కల్కి కథేమిటి? అనే విషయంలో చిత్రబృందం ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. విడుదలకు ముందు అసలు ఈ సినిమాకు స్ఫూర్తి ఏమిటో, ఈ కథ ఎలా ఉండబోతోందో గుట్టు విప్పాడు దర్శకుడు నాగ అశ్విన్.
నాగ అశ్విన్‌కు చిన్నప్పటి నుంచీ పాతాళ భైరవి, భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి సినిమాలంటే చాలా ఇష్టమట. హాలీవుడ్ లోని స్టార్ వార్స్ లాంటి సినిమాలూ నచ్చేవట. అయితే స్టార్ వార్స్ మనవైన కథలు కావు. మన కథల్ని స్టార్ వార్స్ స్థాయిలో తీయాలంటే ఏం చేయాలి? అనే ఆలోచనల్లోంచి పుట్టిన కథే `కల్కి` అంటున్నాడు నాగ అశ్విన్. ప్రతీ యుగంలోనూ ఓ రాక్షసుడు పుడతాడు. వాడ్ని అంతం చేయడానికి దేవుడు అవతారం ఎత్తుతాడు. ఏ పురాణాలకు అయినా ఇదే ఇతివృత్తం. కలియుగంలోనూ అలాంటి కథే ఉంది. ఈ యుగం ఎలా అంతం అవుతుంది? దానికి ముందు ఏం జరగబోతోంది? అనే ఆలోచనతో ‘కల్కి’ కథ రాసుకొన్నాడట నాగ అశ్విన్. ఈ కథ పూర్తిగా సిద్ధం అవ్వడానికి ఐదేళ్లు పట్టిందట. ‘మహానటి’ తరవాత నాగ అశ్విన్ పూర్తిగా ‘కల్కి’పైనే దృష్టి పెట్టాడు. మేకింగ్ కి దాదాపు రెండేళ్లు సమయం తీసుకొన్నాడు. రూ.500 కోట్లకు పైబడి బడ్జెట్ కేటాయించారు. మరి ఈ కష్టం ఎలాంటి ప్రతిఫలం ఇస్తుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాలి.