నాగ అశ్విన్ ఏదో పెద్ద స్కెచ్చే వేశాడు. కల్కి కోసం. పురాణాల్నీ, సైన్స్‌నీ ఈ సినిమాలో మిక్స్ చేసేశాడు. ఈ విషయాన్ని నాగ అశ్విన్ స్వయంగా చెప్పాడు. కల్కి జోనర్ ఏమిటన్న విషయంలో చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఇదో సైన్స్ ఫిక్షన్ అనే ప్రచారం జరుగుతోంది. సైన్స్ ఫిక్షనే.. కానీ దానికి పురాణాలు మిక్స్ చేశాడు అశ్విన్. పురాణాల్లో ఆయుధాలకు ఇప్పటి సాంకేతికత మిక్స్ చేసి రాసుకొన్న కథ కల్కి అని ఓ చిట్ చాట్ లో బయటపెట్టాడు నాగ అశ్విన్.
పురాణాల్లోని కొన్ని పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకొని.. ఈ సినిమాలోని హీరో, ఇతర పాత్రలకు ఆ క్యారెక్టరైజేషన్ అప్లై చేశాడు నాగ అశ్విన్. అమితాబ్ బచ్చన్ పాత్ర అశ్వద్దామని పోలి ఉంటుందని సమాచారం. ప్రభాస్ కల్కి అవతారం ఎత్తబోతున్నాడు. కమల్ హాసన్ పాత్ర కూడా పురాణాల్లోంచి స్ఫూర్తిగా తీసుకొన్నదే. మొత్తానికి ప్రేక్షకుల కోసం ఓ కొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు. ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తారని ప్రచారం జరుగుతోంది. నాగ అశ్విన్ మాటలు కూడా దాన్ని ధృవీకరిస్తున్నాయి. ఎన్ని భాగాల్లో ఈ కథ చెప్పాలన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చాడు. కచ్చితంగా ఫ్యూచర్ ప్రభాస్‌ని ఈ సినిమాలో చూస్తారని అభిమానులకు మాటిచ్చేశాడు నాగ అశ్విన్. 2024 మార్చిలో కల్కికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాబోతోంది. విడుదల తేదీ కూడా త్వరలోనే ప్రకటిస్తారు.