సావిత్రికి సినిమాయే జీవితం… ఆమె జీవితమంతా సినిమాయే. సినిమానీ, ఆమెనూ విడదీసి చూడలేనంతగా సావిత్రి బతికింది. పెళ్లి, పిల్లలు, పిల్లల పెళ్లిళ్లు ఆమె సినిమా జీవితంతో ముడిపడ్డాయి. ఒకట్రెండు కాదు.. దగ్గర దగ్గరగా మూడు వందల సినిమాల్లో నటించింది. ఎంతోమంది సినిమా ప్రముఖులతో ఆమెకు స్నేహపూర్వక, గౌరవ సంబంధాలు వున్నాయి. ఆమెతో కలిసి పని చేసిన వారెందరో. అటువంటి నటి జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నారంటే ఎంతమందిని కలిసుంటారో? దర్శకుడు ఎంత రీసెర్చ్ చేసి వుంటారో? అని సినిమా ప్రారంభ సమయంలో చాలామంది అనుకున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయ్యి విడుదల దగ్గర పడుతుండగా… అప్పటి సినిమా ప్రముఖులు మమ్మల్ని సంప్రదించలేదేంటి? అని అడగటం మొదలుపెట్టారు. ‘మహానటి’ ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకేంద్రులు రాఘవేంద్రరావు నేరుగా దర్శకుడు నాగ అశ్విన్‌తో ‘సినిమా తీసే ముందు నన్ను సంప్రదించలేదు ఏంటి?’ అని అడిగారు. ఇదే విషయాన్ని నాగ అశ్విన్‌ని అడిగితే… “సావిత్రి జీవితం గురించి తెలియనిది ఎవరికి? ఆమెపై తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నాలుగు ఐదు పుస్తకాలు వచ్చాయి. అందులో వీకే మూర్తి సోమరాజు రాసిన పుస్తకంలో ఎంతో సమాచారం వుంది. అలాగే, సావిత్రిగారి పిల్లలు చాలా విషయాలు చెప్పారు. నిజం చెప్పాలంటే… వాళ్లు చేసినంత రీసెర్చ్ నేను చేయలేదు. నాకు వాళ్లే ఆధారంగా నిలిచారు. ఒకరి సమాచారంతో మరొకరి సమాచారాన్ని సరిచూసుకున్నా. నేను ఏదీ మిస్ అయినట్టు అనిపించలేదు” అని చెప్పారు. అదండీ సంగతి. అందరికి తెల్సిన సావిత్రి జీవితాన్ని నిజాయితీగా 99శాతం నిజ జీవిత సంఘటనలతో సినిమాగా తీశానని నాగ అశ్విన్ తెలిపారు. కామెడీ కోసం ఒక్క శాతం స్వేచ్ఛ తీసుకున్నార్ట.