నాగార్జునది ఎప్పుడూ టేక్ ఇట్ ఈజీ పాలసీనే. తన మాటల్లో, చేతల్లో అదే కనిపిస్తుంటుంది. అయితే నాగ్ తొలిసారి ఎమోషనల్ అయ్యాడు. అదీ… ఓ పబ్లిక్ ఫంక్షన్లో! నాగార్జున – రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈసినిమా ఆడియో ఫంక్షన్ ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన నాగ్.. కంటతడి పెట్టించాడు. వేంకటేశ్వరస్వామిని తాను కోరిన కోరికల చిట్టా విప్పి… హృదయాల్ని పిండేశాడు. వెంకటేశ్వరస్వామిని తన స్నేహితుడిగా భావిస్తానని చెప్పిన నాగ్.. చిన్నప్పుడు తన తల్లి తనని తిరుపతి తీసుకెళ్లడం, ఆ తరవాత… తల్లి కోసమే తొలి కోరిక కోరడం ఇవన్నీ గుర్తు చేసుకొన్నాడు.
”ఆ స్వామిని ఎప్పుడూ ఏం అడగలేదు. ఇంత గొప్ప జీవితాన్ని, కుటుంబాన్ని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొనేవాడ్ని అంతే. అయితే తొలిసారి మా అమ్మ గురించి ఓ కోరిక కోరుకొన్నా. తన ఆరోగ్యం క్షీణించింది. ఎవ్వరినీ గుర్తు పట్టడం లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండేది. ఆ సమయంలో నాన్నగారి మొహం చూడలేకపోయేవాడ్ని. అందుకే ‘అమ్మని తీసుకెళ్లిపో దేవుడా’ అని కోరుకొన్నా. ఆ రోజే నాకు ఫోన్ వచ్చింది. అమ్మ వెళ్లిపోయిందని… అలా అమ్మని ఆ బాధ నుంచి విముక్తిరాల్ని చేశాడు. నాన్నగారి ఆఖరి చిత్రం `మనం`. ఈ సినిమాకి నేను చేయాల్సిందంతా చేశా. కానీ హిట్ చేయాల్సింది నువ్వే.. అని వేడుకొన్నా. అప్పుడూ నా కోరిక తీర్చాడు. నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకొంటూ తిరుపతి వెళ్లా. తిరిగొచ్చిన వెంటనే వాళ్ల పెళ్లిళ్లు ఖాయమైపోయాయి” అంటూ ఎమోషనల్, స్పిరిట్యువల్ స్పీచ్ ఇచ్చాడు నాగ్! తల్లిని గుర్తు చేసుకొన్న సందర్భంలో నాగ్ కళ్లలో, అది వింటున్న అఖిల్, నాగచైతన్య కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. నాగ్ ఫ్యాన్స్‌కీ హార్ట్ టచ్ అయ్యింది. నాగ్ని ఎప్పుడూ ఇంత ఎమోషనల్‌గా చూడని రాఘవేంద్రరావు కూడా నాగ్ స్పీచ్ అయిన వెంటనే గట్టిగా హగ్ చేసుకోవడం కనిపించింది.