టీవీ ఛానళ్లని నిషేధించే దిశగా టాలీవుడ్ అడుగులు వేస్తోందని, దాదాపుగా చిత్రసీమ ఓ నిర్ణయం తీసేసుకుందని ప్రచారం జరుగుతోంది. ఎలక్ట్రానిక్ మీడియాకీ, టాలీవుడ్‌కి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైనట్టే అని విశ్లేషకులు కూడా గట్టిగా చెబుతున్నారు. పరిశ్రమలోనూ అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఈ అర్థరాత్రి నుంచి కంటెంట్నిలుపు వేయాలని టాలీవుడ్ పెద్దలు భావించినట్టు వార్తలొచ్చాయి. వీటి వెనుక మెగా ఫ్యామిలీ ఉందని, వాళ్లంతా కలసి కట్టుగా చిత్రసీమపై ఒత్తిడది తీసుకొచ్చారని తెలుస్తోంది. వీటిపై నాగబాబు స్పందించారు. ”న్యూస్ ఛానల్స్‌ని బ్యాన్ చేయాలన్న ఆలోచనే లేదు. ఎవరో ఏదో అన్నారని కంగారు పడుతున్నారంతే. మా దగ్గర ఇలాంటి ప్రతిపాదనేం లేదు. ఇండ్రస్ట్రీ కి మంచి జరగాలంటే ఏం చేయాలన్న విషయంపై చర్చించాం. అంతే తప్ప.. మీడియాకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేద”న్నారు. అయితే నా పేరు సూర్యకి కొన్ని ఛానళ్లు, వెబ్ సైట్లు కావాలని నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారని, సినిమా బాగాలేదని, అవుట్‌పుట్ సరిగా రాలేదని వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు నాగబాబు. ”సినిమా చూసి ఏదైనా చెప్పొచ్చు. సినిమా బయటకు రాకముందే ఇలాంటి ప్రచారం చేయడం బాగాలేదు. ఇది కావాలని సాధిస్తున్న కక్ష” అన్నారు నాగబాబు.