నాగబాబు ఎన్నికల్లో పోటీ చేస్తారని.. అందు కోసం కాకినాడ సీటును ఎంచుకున్నారని కొద్ది రోజులుగా ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. నాగబాబు తన ఓటును ఏపీకి మార్చుకునేందుకు దరఖాస్తు చేయడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఆయని పోటీ చేయడం పెద్ద విషయం కాదు కానీ.. కొద్ది రోజుల క్రితం తాను ఇక ఎన్నికల రాజకీయాలకు దూరమని.. పోటీ చేయబోవడం లేదని ప్రకటించారు. పలుమార్లు ఈ విషయం చెప్పారు. అందుకే ఇప్పుడు టీడీపీతో పొత్తు కుదిరినందున గెలుపు అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్న నమ్మకంతో నాగబాబు పోటీకి సిద్ధమయ్యారని చెబుతున్నారు.
అయితే నాగబాబు జరుగుతున్న ప్రచారం లో నిజం లేదని.. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. మీడియాకు స్పష్టత ఇచ్చారు. జరుగుతున్న ప్రచారం అంతా గందరగోళ పర్చడానికేనని చెబుతున్నారు. గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి నాగబాబు పోటీ చేశారు. రెండు లక్షల పైచిలుకు ఓట్లు తెచ్చుకున్నా మూడో స్థానానికి పరిమితమయ్యారు. వైసీపీ తరపున పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన మళ్లీ నర్సాపురం నియోజకవర్గంవైపు పెద్దగా వెళ్లలేదు ., అప్పట్లో చివరి క్షణంలో పోటీకి దిగడంతో ఓటును కూడా ఏపీకి మార్చుకోలేదు.
ఈ సారి మంగళగిరి అడ్రస్ పెట్టి ఓటు మార్పించుకుంటున్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఖాయం కావడంతో ఆయన పూర్తి స్థాయిలో ఎన్నికలు అయిపోయే వరకూ ఏపీలోనే ఉండి పార్టీ వ్యవహారాలను చక్క బెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు ఖండించినప్పటికీ.. తర్వాత ఏదో ఓ స్థానం నుంచి పోటీ చేసినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.