మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులు కానీ, సినీ రంగంలో ప్రత్యర్థులు కానీ చిరంజీవి పైన లేదంటే పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న ప్రతిసారి వారి తరఫున వకాల్తా పుచ్చుకుుని నాగబాబు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రతి విమర్శలకు మెగా అభిమానులు జనసైనికుల నుండి మంచి స్పందన వస్తుంది. ఆయన పోస్టులను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారు చాలా మంది ఉన్నారు. అయితే నాగబాబు అప్పుడప్పుడు మతం గురించి దేవుడు గురించి చేసే ట్వీట్లు మాత్రం జనాల నే కాకుండా జనసైనికులు మెగా అభిమానులను కూడా గందరగోళ పరుస్తున్నాయి. ఉదాహరణకు ఇవాళ దేవుడు అన్న కాన్సెప్ట్ గురించి నాగబాబు ఈ విధంగా ట్వీట్ చేశారు.
నాగబాబు ట్వీట్ చేస్తూ, ” ఒకప్పుడు superstar రజనీకాంత్ గారు చెప్పారు,,అది ఏంటంటే మన కంటికి కనబడే ఏదయినా ఎవరో ఒకరు create చేసిందే అయివుంటది. లేకపోతే ఆ వస్తువు కి ఉనికి ఉండదు.అలాగే ఇంత విశాల విశ్వం కూడా ఉనికి లో ఉందంటే ఎవరోఒక క్రియేటర్ వుండే ఉండాలి.అతడే భగవంతుడు అని చాలా గంభీరంగా చెప్పారు. మరి అంత create చేసిన దేవుడి ని create చేసింది ఎవరు.ఒక శక్తి ఉనికి లో ఉందంటే దానికి ఒక క్రియేటింగ్ రీసన్ వేరే ఉండాలి.ఆ రీసన్ దేవుడిని create చేసి ఉండాలి.అలాగే ఆ దేవుడిని create చేసిన రీసన్ కి ఇంకో రీసన్ ఉండాలి.సో అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అంతు పొంతూ ఉండదు. సో గాడ్ అనే కాన్సెప్ట్ కి మీనింగ్ ఏది లేదు.సో లెట్స్ లివ్ our lives వితౌట్ the ఇన్వొల్వెమెంట్ of గాడ్ కాన్సెప్ట్..nietzsche చెప్పినట్లు” god is dead” long back. So no worries. No guilt. BUT LIVE ACCORDING TO LAW. ” అని రాసుకొచ్చారు.
అయితే అసలు నాగబాబు ఏం చెప్పదలచుకున్నాడో అర్థం కాక జనసైనికులు తికమక పడుతున్నారు. ఒకవైపు ఏమో బిజెపి భావజాలానికి అనుగుణంగా హిందుత్వానికి అనుగుణంగా ట్వీట్లు వేయడం, ఇంకొక వైపు ఏమో తాను నాస్తికుణ్ణి అన్న అభిప్రాయం వచ్చేలా ట్వీట్లు వేయడం చేస్తుండటం వల్ల, ఈ రెండింటికి పొసగక ఆయన అకౌంట్ ఫాలో అయ్యే వారు తికమక పడుతున్నారు. పైగా మతం, దేవుడు అన్నవి అత్యంత సున్నితమైన అంశాలు. వీటిమీద ఎడాపెడా అభిప్రాయాలు వెలువరచడం వల్ల భవిష్యత్తులో ఎప్పటికైనా నష్టమే తప్ప ఒరిగేది ఏమీ ఉండదు అని మెగా అభిమానులు వాపోతున్నారు. అదీ గాక తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే, తెలుగు రాష్ట్రాలలో నాస్తికులు చాలా తక్కువ. ఇక్కడి ప్రజలకు దేవుడి పట్ల మతం పట్ల విశ్వాసం పాళ్లు ఎక్కువ. ప్రజాజీవితంలో ఉంటున్నప్పుడు, రాజకీయాల్లో అడుగులు వేస్తున్నప్పుడు ప్రజల మనోభావాలను ఇబ్బంది పెట్టే ట్వీట్ ల జోలికి వెళ్లకపోవడమే నాగబాబుకు ఉత్తమమైన పని అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కుండ బద్దలు కొట్టినట్లు అభిప్రాయాలు చెప్పడం మంచిదే కానీ, అవసరం లేని ప్రతిచోటా అనవసరమైన కుండలు అన్నింటినీ బద్దలు కొట్టడం కూడా సమంజసమైన పనికాదు. మరి అభిమానుల నుండి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో నాగబాబు పంథా మార్చుకుంటాడా అన్నది వేచి చూడాలి.