ఏపీలో త్వరలో మూడు రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. రాజీనామా చేసిన మోపిదేవి, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు ఏదో ఓ పార్టీలో చేరినా వారిని రాజ్యసభకు పంపే అవకాశాల్లేవు. అందుకే టీడీపీ, జనసేనల్లో కొత్తపేర్లు చర్చకు వస్తున్నాయి. మూడు సీట్లలో ఒకటి కూటమి పార్టీలకు అందులోనూ జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. ఒక వేళ ఆ పార్టీకి ఇస్తే నాగబాబు పేరు తప్ప మరోపేరు రేసులో ఉండే అవకాశం లేదు.
ఇక టీడీపీలో రెండు స్థానాలకు చాలా పేర్లు పరిశీలనకు వస్తున్నాయి. అశోక్ గజపతిరాజు, యనమల, దేవినేని ఉమ, గల్లా జయదేవ్ వంటి పేర్లను టీడీపీ వర్గాలు హైలెట్ చేస్తున్నాయి. గల్లా జయదేవ్ కుటుంబ నేపధ్యం.. ెన్ని వేధింపులు ఎదురైనా పోటీకి దూరంగా ఉన్నారు కానీ పార్టీకిదూరం కాకపోవడం వంటివి ఆయనకు ప్లస్ గా మారాయి. చట్టసభల్లో ధాటిగా మాట్లాడగలిగే నైపుణ్యం ప్లస్ పాయింట్. టీడీపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ అశోక్ గజపతిరాజు. ఆయన సీనియారిటీని గుర్తించాలని చంద్రబాబు అనుకునే అవకాశం ఉంది. దేవినేని ఉమ త్యాగం చేశారు. ఆయన గుర్తింపు కోరుకుంటున్నారు. యనమల కూడా రాజ్యసభపై ఆశలు పెట్టుకున్నారు.
ఈ మూడు రాజ్యసభ పదవులు పూర్తి పదవికాలం ఉన్నవి కావు. రెండేళ్ల నుంచి నాలుగేళ్ల పదవి కాలం ఉన్నవి మాత్రమే. సీనియర్లకు కేటాయిస్తే మరోసారి తరవాత కూడా వారికే చాన్స్ ఇవ్వాల్సి రావొచ్చు. అందుకే చంద్రబాబు తీసుకునే నిర్ణయంపైనే ఆసక్తి వ్యక్తమవుతోంది. మరికొంత మంది వైసీపీ ఎంపీల రాజీనామాలపైనా చర్చ జరుగుతోంది.