మెగా ఈవెంట్లో నాగబాబు కామెంట్లు కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఇండ్రస్ట్రీ అంతా అదే హాట్ టాపిక్. అన్నయ్య ఫంక్షన్‌కి తమ్ముడు పవన్ కల్యాణ్ ఎందుకు రాలేదన్నది పక్కకు వెళ్లిపోయింది. నాగబాబు అంత ఘాటుగా ఎందుకు కామెంట్లు చేశాడు? దానికి వచ్చిన రియాక్షన్ ఏమిటి? అన్నదే అసలు సిసలు పాయింట్‌గా మారింది. నాగబాబు ఆవేశంగా అక్కుపక్షి అన్నది రాంగోపాల్ వర్మనే అని, మూర్ఘుడు అంటూ బిరుదు ఇచ్చింది యండమూరికే అన్నది.. వాళ్లకు కూడా అర్థమైపోయింది. అందుకే అటు వర్మ, ఇటు యండమూరి కూడా స్పందించారు. యండమూరి కాస్త మర్యాదగా ‘నాగబాబు ఆవేశపడ్డాడంతే’ అన్నాడు గానీ.. వర్మ మాత్రం తనదైన శైలిలో కౌంటర్లు వేయడం మొదలెట్టేశారు. వర్మ అచ్చంగా ఇలానే రియాక్ట్ అవుతాడన్నది అందరూ ఊహించినదే. అందులో కొత్తేం లేదు. అయితే నాగబాబు ఇంతెందుకు ఆవేశపడ్డాడన్నదే మెయిన్ పాయింట్. నాగబాబు అనవసరంగా కెలుక్కొన్నాడు అని కొందరు అంటుంటే… అతని ఆవేశానికి అర్థం ఉందని మరి కొంతమంది మెగా ఫ్యాన్స్ వెనకేసుకొస్తున్నారు.
చిరు 150వ సినిమా మొదలైనప్పటి నుంచీ ఏదోలా దాన్ని టార్గెట్ చేస్తూనే వస్తున్నాడు రాంగోపాల్ వర్మ. ఆఖరికి బాలయ్య సినిమాతో ముడిపెట్టి… పోలుస్తున్నాడు. చిరు సినిమా కంటే బాలయ్య సినిమానే బాగుందని పరోక్షంగా ఖైదీని చిన్నచూపు చూస్తున్నాడు. బహుశా.. అదే నాగబాబులో ఆవేశానికి పెట్రోల్ పోసినట్టుంది. యండమూరి కూడా తక్కువ తినలేదు. ఓ సందర్భంలో చరణ్‌కీ, దేవిశ్రీ ప్రసాద్‌ని పోల్చే క్రమంలో చరణ్‌ని చాలా తక్కువ చేసి మాట్లాడాడు. మొహానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని వచ్చాడని, తండ్రి పేరు చెప్పుకొనే రకం అని గట్టిగానే చురకలు అంటించాడు. చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నోరు జారి.. ‘చిరు రాజకీయాలకు పనికి రాడు’ అనేశాడు. ఇదంతా నాగబాబు, అండ్ మెగా ఫ్యామిలీ గమనిస్తూనే ఉంది. కానీ.. బదులు చెప్పే అవకాశం ఇప్పటి వరకూ రాలేదంతే. వర్మపై మాటలతో దండయాత్ర చేసిన నాగబాబు, పనిలో పనిగా యండమూరినీ కడిగి పడేశాడు. యండమూరి లౌక్యుడు. అందుకే… ‘నేనేం పెద్దగా పట్టించుకోలేదు’ అంటూ కవరింగ్ ఇచ్చాడు. ఇలాంటివి వర్మకు ఏమాత్రం తెలీదు. అందుకే… వార్ మొదలెట్టేశాడు. ఇక రేపటి నుంచి.. ట్వీట్ల పండగే.