సీఎం సీఎం అని అరవడం కాదు.. జనసేనకు ఓట్లు వేయాలి అని అరుస్తున్న అభిమానులపై జనసేన సీనియర్ నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈ మాట మొదట మొదటగా నాగేంంద్రబాబు చెప్పలేదు. పవన్ కల్యాణ్ కూడా చాలా సార్లు చెప్పారు. తన సభలకు వచ్చే వారంతా తనకు ఓట్లేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఓట్లేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పుకునేవారు. వైసీపీ రాజకీయ వ్యూహమో మరొకటో కానీ.. పవనన్నకు ప్రాణమిస్తాం.. జగనన్నకు ఓటు వేస్తామనే ఓ ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. దానికి తగ్గట్లుగా పవన్ కల్యాణ్ పార్టీ ఎంతో స్ట్రాంగ్ అనుకున్న చోట్ల కూడా ఓట్లు రాలేదు . ఈ కారణంగానే సీఎం సీఎం అని అరిచేవారంతా ఓట్లు వేయడం లేదన్న అభిప్రాయాన్ని జనసేన పెద్దలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే పవన్ కల్యాణ్ ఓ సారి ఇలా అని ఊరుకుంటే సరిపోతుందేమో కానీ అందరూ అవే మాటలు అంటే జనసైనికుల్ని కించపర్చినట్లే. ఇతర పార్టీల నేతలు జన సమీకరణ చేసుకోవాలి కానీ.. పవన్ కల్యణ్కు ఆ అవసరం లేదు. ఆయన వస్తున్నారంటే అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అయితే ఇలా వచ్చే వారంతా ఓటు వేస్తారా లేదా అన్నది రాజకీయ పరిస్థితుల్ని బట్టి ఉంటాయి. వీరాభిమానులు మాత్రం పవన్ కు ఓటు వేస్తారు. కానీ ఆలోచనా పరులు… ఇతర రాజకీయ సంబంధాలు ఉన్న వారు మాత్రం సొంత నిర్ణయం తీసుకుంటారు. అలాగే అభిమానులు మాత్రమే ఓట్లు వేస్తే విజయం సాధించరు.
స్వచ్చమైన అభిమానులు ఎప్పటికీ ఓట్లు వేస్తారు. అయితే వారిని కూడా కించపరిచేలా జనసేన పెద్దలు వ్యవహరిస్తూండటం మాత్రం వారి మనసు చివుక్కుమనేలా చేస్తోంది. ముందు తమ ఓటర్లను గౌరవించుకోవాలని… ఇలా ఓట్లు వేయడం లేదని నిష్టూరమాడటం తగ్గించుకోవాలన్న సలహాలు వస్తున్నాయి. అయితే … తమ వాళ్లే తమకు ఓట్లేయలేదన్న గట్టి నమ్మకంతో ఉన్న జనసైనికులు.. ఈసారి అయినా వారితో ఓట్లు వేయించుకోవాలని ఇలా నిష్ఠూరమాడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే నిజమైతే.. అది ఖచ్చితంగా రాంగ్ వ్యూహం అని… ముందు సొంత వాళ్లను గౌరవించాలని అంటున్నారు.