ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల హంగామా దగ్గరపడే కొద్దీ సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయరంగానికి చెందిన ఏ ఇద్దరు కలిసినా.. అదో హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా.. నాగేంద్రబాబు – విజయ్ సాయిరెడ్డి భేటీ అయ్యారన్న విషయం రాజకీయ రంగంలో ఆసక్తిగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గత రెండు మూడు రోజులుగా.. నాగబాబుకీ, వైసీపీ కీలక నేత విజయ్ సాయి రెడ్డికి మధ్య వాడీ వేడిగా మంతనాలు జరుగుతున్నాయని సమాచారం. రాబోయే ఎన్నికల్లో జనసేన, వైకాపా కలసి పోటీ చేయబోతున్నాయన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఆ ఊహాగానాలకు ఈ భేటీ మరింత ఊతం ఇవ్వనుంది. 2019 ఎన్నికలలో వైకాపాకి సపోర్ట్ చేసేలా పవన్‌ని ఒప్పించే బాధ్యత నాగబాబు తీసుకున్నారని, జనసేనకు 25 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికి వైకాపా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ యూరప్‌లో ఉన్నాడు. నాగబాబు – విజయ్ సాయిరెడ్డి మధ్య భేటీ పవన్ కి తెలిసే జరుగుతోందా? లేదంటే… ఇవి కేవలం వైకాపా నుంచి జరుగుతున్న ప్రయత్నాలా? అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.