చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో దూరమైపోయారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్ని… అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అత్యంత బద్ధ విరోధి అయిన తెలుగుదేశం పార్టీతోనే పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగినప్పుడు కూడా చిరంజీవి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. చిరు తమ టీమ్ సభ్యుడు కాదని కాంగ్రెస్‌పార్టీ కూడా ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. మరి ఇప్పుడు రాజకీయంగా చిరు భవిష్యత్తు ఏమిటి? ఆయన వ్యూహాలు ఎలా ఉన్నాయన్నది చిరు అభిమానులకు సైతం అంతు పట్టడం లేదు. రాజకీయ విశ్లేషకులు మాత్రం చిరంజీవి జనసేనలో చేరడం గ్యారెంటీ అని, ఎన్నికల ముందు జనసేన పార్టీలో సంభవించే అత్యంత కీలకమైన పరిణామం ఇదేనని ఎప్పుడో లెక్కగట్టేశారు. పవన్ కూడా చిరుని సాదరంగా ఆహ్వానించి, గౌరవ అద్యక్ష పదవి కట్టబెడతాడన్న ఊహాగానాలూ వినిపించాయి. వీటిపై అటు చిరంజీవి గానీ, ఇటు పవన్ కల్యాణ్ గానీ ఇంత వరకూ ఏమీ మాట్లాడలేదు.
అయితే తాజాగా నాగబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ, అందులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తుంటే.. అతి తొందర్లోనే చిరు జనసేనలో చేరడం ఖాయమనిపిస్తోంది. చిరు జనసేనతో ఎప్పుడు కలుస్తారు? అనే ప్రశ్నకు ఓ రకంగా స్పష్టంగానే సమాధానం చెప్పారు నాగబాబు. తామంతా ఒక్కటే అని, కలసినప్పుడల్లా పార్టీ గురించి మాట్లాడుకుంటూనే ఉంటామని తేల్చేశారు నాగబాబు. ”తమ్ముడి ఆలోచనలు, అభిప్రాయాలు, తన ఎదుగుదల ఇవన్నీ అన్నయ్య గమనిస్తున్నారు. అది చూసి ఆయన చాలా సంతోషంగా ఉన్నారు.. మేమంతా ఒక్కటే. మా అవసం ఉన్నప్పుడు తప్పకుండా పవన్ కల్యాణ్‌కి సపోర్ట్ ఇస్తాం” అంటూ జరగబోయే పరిణామాల్ని సూత ప్రాయంగా చెప్పారు నాగబాబు. అయితే తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని లేదని, కావాలంటే గ్రౌండ్ వర్క్ చేసి పెడతానని చెప్పుకొచ్చారు.
నాగబాబు మాటల్ని బట్టి రెండు విషయాలు అర్థం అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా త్వరలోనే ఒక తాటిపైకొచ్చి.. జనసేనకు సపోర్ట్ చేయడం ఖాయం. అయితే.. అదెప్పుడదన్నది చిరంజీవి చేతుల్లో ఉంది. చిరు ముందడుగు వేస్తే… జనసేన జెండా పట్టుకోవడానికి అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నాడు. చరణ్ అయితే… ‘నా సపోర్ట్ బాబాయ్‌కే’ అని చాలాసార్లు చెప్పాడు. చిరు అడుగేస్తే.. మెగా ఫ్యామిలీ మొత్తం ఆయన వెనుక ఉంటుంది. చిరు తమ్ముడితో కలిస్తే… ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. చిరంజీవి జనసేన తరపున ఎన్నికల్లో నిలబడినా, నిలబడకపోయినా.. రాజకీయ సమీకరణాల విషయంలోనూ మాత్రం చిరు వ్యూహాలు కచ్చితంగా కలిసొస్తాయి.