ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. ఎన్ని లైకులు వచ్చాయి..? ఎన్ని వ్యూస్ వచ్చాయి..? అన్న దానిపై.. వాళ్ల వాళ్ల క్రేజ్ ఆధారపడి ఉంటోంది. అందుకే… ఎంత చిత్రంగా.. ఎంత విచిత్రంగా ప్రవర్తించడమో..? మాట్లాడటమో చేస్తే వ్యూస్ వస్తాయి. లైక్స్ వస్తాయి. అయితే.. ఇది సామాన్యులకు పెద్దగా వర్తించదు. సెలబ్రిటీలుగా ఫీలయ్యేవారికి మాత్రమే. ఎందుకంటే… జియో సిమ్ములతో ఉచితంగా వచ్చే డేటాతో… యువత సోషల్ మీడియాలో పడి… టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటుంది.. అలాంటి వాళ్లు.. తమ మాటలకు.. ఇదైపోతారని.. చాలా మంది సెలబ్రిటీలుగా ఫీలయ్యేవారి లెక్క. అందుకే ఇటీవల కాలంలో ఇలాంటివి ఎక్కువైపోయాయి.
మొన్నటికి మొన్న కేఏ పాల్ అనే పెద్ద మనిషి.. ఓ టీవీ చానల్లో కూర్చుని సీరియస్‌గా.. యాంకర్ బాలకృష్ణ గురించి అడిగితే.. తనకు తెలియదన్నారు. అసలు ఆ సందర్భంలో.. బాలకృష్ణ ప్రస్తావన ఎందుకు తీసుకు రావాల్సి వచ్చిందో యాంకర్‌కే తెలియాలి. బాలకృష్ణ తెలియదని కేఏ పాల్ ఎందుకన్నారో ఇంకో మిస్టరీ. కానీ ఆ వీడియో మాత్రం వైరల్ అయిపోయింది. ఇదేదో బాగుందని… చూసేవాళ్లు లేక గొడ్డుబోయిన ఆ చానల్… ఆ వీడియోను మార్కెట్ చేసుకుంది. లక్షల వ్యూస్ వచ్చే సరికి బాలకృష్ణ పేరు చెప్పుకుని కాసిన్ని డబ్బులు వెనకేసుకుంది. దీన్ని చూసి.. ఆ కేఏ పాల్ .. తనకు అన్ని లక్షల ఫాలోయింగ్ ఉందని.. చెలరేగిపోతున్నారు…అది వేరే విషయం.
ఇప్పుడు కేఏపాల్‌కు తోడుగా… పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. ఓ జర్నలిస్టును పిలిపించుకుని బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా అడిగించుకుని మరీ తనకు తెలియదన్నట్లుగా సమాధానం చెప్పారు. దాన్ని ఆన్ లైన్ లో పెట్టుకున్నారు. వందలు , లక్షల వ్యూస్ వస్తున్నాయి. దాంతో నాగబాబు కూడా బాగానే సొమ్ము చేసుకుంటారు. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే.. ఎవరికైనా ఆన్ లైన్ లో ఉన్న పళంగా వైరల్ కావాలన్న కోరిక ఉంటే.. వెంటనే… ఓ వేలల్లో పుట్టుకొచ్చిన యూట్యూబ్ చానల్‌కి ఓ ఇంటర్యూ ఇచ్చి అందులో సందర్భం లేకపోయినా.. బాలకృష్ణ తెలియదని చెప్పి… వెంటనే సోషల్ మీడియాలో ” స్పాన్సర్డ్ ” కేటగిరిలో పెట్టించేయండి. కోరిక నెరవేరుతుంది. అయితే ఇది.. కనీసం బాలకృష్ణ ఫ్యాన్స్ గుర్తు పట్టగలిగే సెలబ్రిటీలకు మాత్రమే వర్తిస్తుంది..!