నాగబాబు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ, సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో “పవన్ కళ్యాణా? అతను ఎవరు ? నాకు తెలియదు” అంటూ బాలయ్య దురుసుగా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా అన్నట్టుగా ‘ బాలకృష్ణ ఎవరో నాకు తెలీదు’ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (https://www.telugu360.com/viral-video-naga-babus-tit-for-tat-for-bala-krishna/) అయితే ఇదే ఇంటర్వ్యూలో బాలకృష్ణ పై చేసిన వ్యాఖ్యలే కాకుండా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా ను , తెలుగు అగ్ర మీడియాను విమర్శిస్తూ కాస్త సూటి వ్యాఖ్యలు చేశాడు నాగబాబు.
పవన్ కళ్యాణ్ పై బురద చల్లి ఉద్దేశ్యపూర్వక కథనాలు:
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో ప్రజలలోకి వెళుతూ సీరియస్ గా రాజకీయాల వైపు దృష్టి సారించాడు. ఇప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమా చేసే అవకాశం లేదని అందరికీ తెలిసినప్పటికీ తెలుగులో ఎంతో మంది ప్రజలు నమ్మే అగ్ర పత్రిక సైతం పవన్ కళ్యాణ్ వివరణ తీసుకోకుండానే ఆయన సినిమాలో నటించడానికి సిద్ధపడుతున్నట్టు గా కథనం ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం పవన్ కళ్యాణ్ రాజకీయాల పట్ల సీరియస్ గా లేడు, మళ్లీ సినిమాల్లోకి వచ్చేస్తున్నాడు అన్న అభిప్రాయాన్ని ప్రజలలోకి ఇంజెక్ట్ చేయడానికి , ఉద్దేశపూర్వకంగానే మీడియా ఇలాంటి కథనాలు వెలువరిచింది అని నాగబాబు అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ఒక్క ఉదంతాన్ని చూపి మీడియాని మొత్తం నిందించడం సబబు కాదని నాగ బాబు ని ఇంటర్వ్యూ చేస్తున్న రిపోర్టర్ మాట్లాడుతుండగా, మన తెలుగు మీడియా పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా చేసింది ఈ ఒక్క సంఘటన మాత్రమే కాదు, ఇలాంటివే మరెన్నో చేసింది అంటూ పరోక్షంగా కత్తి మహేష్, శ్రీ రెడ్డి ల ఉదంతాన్ని గుర్తు చేశారు నాగబాబు.
గతంలో తెలుగు మీడియా పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేసిన సంగతి ప్రస్తావిస్తే..
అయితే పవన్ కళ్యాణ్ గతంలో లేవనెత్తిన కొన్ని సమస్యల విషయంలోనూ, అలాగే పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన కొన్ని ఉపన్యాసాల విషయంలోనూ ఇదే తెలుగు మీడియా పవన్ కళ్యాణ్ కి ఎంతగానో సపోర్ట్ చేసింది కదా అని రిపోర్టర్ ప్రస్తావిస్తే అందుకు సమాధానంగా, తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతిచ్చినంత కాలం మాత్రమే తెలుగు మీడియా పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేసిందని, ఆ మద్దతు విరమించిన మరుక్షణం నుంచి పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తోందని వివరించారు నాగబాబు.
2018 మార్చి 14 కు ముందు పవన్ కళ్యాణ్ ట్వీట్ల ను కూడా ప్రముఖంగా స్క్రోలింగ్ ఇచ్చిన చాలా మీడియా చానళ్లు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గిరిజనులతో, ఇతర అనేక వర్గాలతో రోజుల తరబడి వారి ప్రదేశాలలోనే ఉంటూ, వారితో మమేకమై గడిపినప్పుడు కూడా అంశానికి సంబంధించి ఎటువంటి వార్త కానీ చిన్న స్క్రోలింగ్ కానీ మీడియా ఇవ్వని వైనాన్ని ఆ విధంగా గుర్తు చేసే ప్రయత్నం చేశారు నాగబాబు
సోషల్ మీడియా లేకపోయి ఉంటే మా పని ఖేల్ ఖతం
తెలుగు మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించిన నాగబాబు, సోషల్ మీడియా గనుక లేకపోయి ఉంటే తమ పరిస్థితి దారుణంగా ఉండేదని వ్యాఖ్యానించారు . అందుకే థాంక్యు సోషల్ మీడియా అంటూ సోషల్ మీడియాకు కృతజ్ఞతలు చెప్పారు
సంచలనం సృష్టించిన కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ ప్రస్తావించిన నాగబాబు
ఆ మధ్య కోబ్రాపోస్ట్ చేసిన స్టింగ్ ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తెలుగు పాఠకులకు, తెలుగు ప్రేక్షకులకు చాలా మందికి ఈ వార్త పెద్దగా తెలియదు. ఎందుకంటే మన తెలుగు మీడియా ఈ వార్తను ఎక్కడ హైలైట్ చేయలేదు. ఆ మధ్య కోబ్రాపోస్ట్ నుంచి కొందరు వ్యక్తులు ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి టీవీ ఛానల్స్ బండారాన్ని బయట పెట్టారు. “మేము మీకు డబ్బులు ఇస్తాము, మీరు సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే కథనాలను మాకోసం ప్రసారం చేస్తారా” అంటూ కోబ్రాపోస్ట్ రిపోర్టర్లు ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తుల మాదిరిగా నటిస్తూ ఆయా చానళ్ల పెద్దల వద్దకు వెళ్లారు. ఈ దేశంలో పని చేస్తున్న అనేకానేక చానల్లు అందుకు అత్యంత సులువుగా ఒప్పుకున్నాయి. దేశం మొత్తం మీద ఒకటి రెండు సంస్థలు మినహాయించి ప్రతి ఛానల్ కూడా డబ్బులు ఇస్తే ఎంత దుర్మార్గమైన ప్రోగ్రాములు వేయడానికైనా సిద్ధ పడతాయని కోబ్రాపోస్ట్ వీడియో సాక్షాలతో నిరూపించింది.
తెలుగు చానల్స్ లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 చానల్స్ పెద్దలు ఇలా ఈ స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయారు.(https://www.telugu360.com/sting-operation-abn-agrees-to-run-campaign-creating-communal-disharmony-if-paid/) కోబ్రా పోస్ట్ ఉదంతానికి సంబంధించి సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇప్పటికీ చాలా వీడియోలు దర్శనమిస్తూ వుంటాయి. కోబ్రా పోస్ట్ ఆ కథనాలను బయట పెట్టిన తర్వాత కూడా ఈ ఛానల్ లు ఏవీ, తాము అలా చేయలేదని ఖండించే సాహసం చేయలేక పోయాయి అంటే అర్థమవుతుంది ఆ ఛానల్స్ ఎంత అడ్డంగా దొరికి పోయాయోనని.
నాగబాబు కోబ్రాపోస్ట్ ఉదంతాన్ని కూడా ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ, తెలుగులో రెండు ఛానళ్లు ఇలా అడ్డంగా దొరికిపోయి అంటూ నేరుగా ఆ ఛానల్స్ పేరు చెప్పకుండా ఆ చానళ్లకు చురకలంటించారు. ఇంత బాహాటంగా ఛానల్ లు దొరికిపోతే ఉంటే ఈ మీడియా స్వచ్ఛంగా పనిచేస్తోందని ఎలా అనుకోవాలి అంటూ ప్రశ్నించారు. తెలుగు మీడియా మొత్తం దాదాపుగా స్పాన్సర్డ్ మీడియా అయిపోయిందని నాగబాబు వాపోయారు.
మీడియా పెద్దల మీదే నా విమర్శలు, జర్నలిస్టుల మీద కాదు
అయితే మీడియా మొత్తం స్పాన్సర్డ్ మీడియా అయిపోయిందని వ్యాఖ్యలు చేసిన నాగబాబు, ఇక్కడ మీడియా అంటే తన ఉద్దేశం జర్నలిస్టుల గురించి కాదని, తాను మాట్లాడుతున్నది మీడియా పెద్దల గురించి మాత్రమేనని స్పష్టత ఇచ్చారు. జర్నలిస్టులు ఆయా మీడియా సంస్థల లో కేవలం ఉద్యోగులు మాత్రమే నని, వారి యాజమాన్యం నిర్దేశించే పాలసీలకు అనుగుణంగానే వారు పనిచేయాల్సి ఉంటుందని, కానీ మీడియా యాజమాన్యాలు డబ్బుకు కక్కుర్తి పడి కొన్ని పార్టీలకు అమ్ముడు పోతున్నారని , కాబట్టి ఆ యాజమాన్యాలు, ఆయా పార్టీలకు అనుకూలంగా నిర్ణయించుకున్న పాలసీలకు లోబడే జర్నలిస్టులు కూడా పని చేయాల్సి వస్తుందని నాగబాబు వివరించారు.
ఏది ఏమైనా తెలుగు అగ్ర మీడియా గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యల లో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. నిష్పాక్షికంగా వార్తలు అందిస్తూ ఏ ఒక్క రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరించకుండా పనిచేస్తున్న ఛానెల్స్ పది శాతం కూడా తెలుగులో లేవని అంటే అందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలుచుకునే మీడియా ఈ స్థాయిలో విమర్శలు పాలవడం ఒకరకంగా దురదృష్టకరమని చెప్పాలి
– జురాన్ (@CriticZuran)