పుట్టినప్పుడు తల్లికి కూడా నొప్పులు కలిగించని పవన్ కల్యాణ్ ప్రజలెవరికీ నొప్పి కలిగించరని నాగబాబు అన్నారు. పిఠాపురం జనసేన పార్టీ ప్లీనరీ జయకేతనం సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ నాయకత్వం, ప్రజలకు ఇచ్చే భరోసాపై గొప్పగా చెప్పారు. అడగకుండా వరాలిచ్చే నాయకుడని ప్రశంసించారు.
ఈ సందర్భంగా పిఠాపురంలో ఎన్నికల సమయంలో తాను పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాము పిఠాపురం వచ్చేటప్పటికీ పవన్ విజయం ఖరారయిందని అర్థం అయిందన్నారు. తాము పని చేసినట్లుగా నటించామని..తమకు క్రెడిట్ ఇవ్వాలనే పవన్ తమకు అక్కడికి పంపించారన్నారు. పవన్ కల్యాణ్, పిఠాపురం ప్రజల వల్లే పవన్ గెలిచారని ఇంకెవరైనా తమ వల్ల గెలిచారని అనుకుంటే అది వారి పిచ్చితనమన్నారు.
జగన్ ను కమెడియన్ గా పోల్చి సెటైర్లు వేశారు. ఆయన ఎన్నికలకు ముందు పడుకున్నారని ఇంకా లేవలేదని పగటి కలలు కంటున్నారని అన్నారు. మరో ఇరవై ఏళ్ల పాటు పడుకునే ఉండాలని జగన్ కు నాగబాబు సలహా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడినా స్వేచ్చ ఉంటుందని కానీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వారి పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం కదా అని గుర్తు చేశారు.
జనసేన పార్టీలో విశ్వాసంగా పని చేయాలని పవన్ కల్యాణ్ అందరికీ మేలు చేస్తారని నాగబాబు స్పష్టం చేశారు. నాగబాబు స్పీచ్ లో ప్రధానంగా పవన్ కల్యాణ్ ను ప్రశంసించడానికే ప్రాధాన్యం ఇచ్చారు.