వివాదాస్పద స్టేట్మెంట్లు ఇవ్వడానికే.. చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు ఓ యూ ట్యూబ్ చానల్‌కు ఇంటర్యూ ఇచ్చినట్లుగా ఉన్నారు. అందులో చివరికి తన కుటుంబాన్ని కూడా కించ పర్చుకునే రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ మూడో పెళ్లి విషయంపై.. యూట్యూబ్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు… పవన్ కల్యాణ్ ఇంతకు ముందు పెళ్లి చేసుకున్న వాళ్లు తమ కుటుంబంలో ఇమడలేకపోయారని.. ఇప్పుడు వచ్చిన అమ్మాయి మాత్రం… ఆ లోటు తీర్చిందని చెప్పుకొచ్చారు. నాగేంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
పవన్ కల్యాణ్‌తో విడిపోయిన ఇద్దరి భార్యల విషయంలో… పవన్ కల్యాణ్ తప్పేమీ లేదని.. అంతా వారి తప్పేనన్నట్లుగా నాగేంద్రబాబు సర్టిఫికెట్ జారీ చేయడంపై… నెటిజన్లలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏమైనా.. వారు ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు దూరమయ్యారు. అలాంటి వారి గురించి .. వారు తమ కుటుంబంలో ఇమడ లేకపోయారని.. వారు పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకోడవం వల్లనే.. తమ కుటుంబానికి మంచి జరిగిందన్నట్లుగా మాట్లాడటం ఎంత వరకు సబబనే ప్రశ్నలు వస్తున్నాయి. వివాహాల విషయంలో పవన్ కల్యాణ్‌ను సమర్థించుకునే విధానం అది కాదని… అంటున్నారు. పవన్‌తో విడిపోయిన ఇద్దరూ.. వేరేగా కొత్త జీవితాల్ని ప్రారంభించారు. ఇలాంటి సమయంలో వారిపై నెగెటివ్ కామెంట్లు చేసి.. నాగబాబు.. పవన్ కల్యాణ్‌ను ఎలా సమర్థిస్తారో… ఎవరికీ అర్థం కావడంలేదు.
నిజానికి ఇంటర్యూ చేసే జర్నలిస్ట్ కూడా.. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారని అడగలేదు. జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలపై మాత్రమే అభిప్రాయం అడిగారు. దానికి ఆయన కౌంటర్ ఇవ్వాల్సింది పోయి… జగన్ రాజకీయంగా అలాంటి విమర్శలు చేసినా తప్పు లేదన్నట్లుగా… పవన్ వైపు నుంచి సంజాయిషీ ఇచ్చుకున్నట్లుగా… ఆ మాజీ భార్యలదే తప్పన్నట్లుగా నాగబాబు మాట్లాడటం… పవన్ అభిమానులకు కూడా నచ్చనిదే. నాగబాబు ఈ ఇంటర్యూ ఏ ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నారో కానీ.. అది మొత్తం ఆయనకు డ్యామేజీనే చేస్తోంది. చివరికి పవన్‌కి… కుటుంబానికి కూడా… ఉపయోగపడటం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.