మంత్రివర్గ మార్పుచేర్పులు తర్వాత పవన్ కల్యాణ్ మంత్రిత్వ శాఖల్లోకొన్ని నాగబాబుకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయని జనసేనలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కొన్ని సినిమాల కమిట్మెంట్లు పూర్తి చేయాల్సి ఉంది. చాలా కాలంగా అవి పెండింగ్ లో ఉన్నాయి. అప్పుడప్పుడు హాఫ్ డే కేటాయిస్తున్నా షూటింగ్ పెద్దగా ముందుకు సాగడం లేదు. నాగబాబు మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత కాస్త రిలాక్స్ అయి అయినా సరే అన్ని సినిమాల షూటింగ్లు పూర్తి చేయాలని పవన్ కల్యాణ్ పట్టుదలగా ఉన్నారు.
పవన్ కల్యాణ్ వద్ద పలు శాఖలు ఉన్నాయి. పంచాయతీరాజ్ ప్రధానమైనశాఖ. అటవీ శాఖ కూడా కీలకం. పవన్ కల్యాణ్ తన శాఖల విషయంలో పూర్తిగా అధికారులకే వదిలేయకుండా.. తన ఆలోచనలకు తగ్గట్లుగా ఉండేలా చూసుకుంటున్నారు. అందుకే అటవీ శాఖను నాగబాబుకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. కందుల దుర్గేష్ వద్ద ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను కూడా నాగబాబుకు కేటాయిస్తారని చెబుతున్నారు. అటవీ, సినిమాటోగ్రఫీ మంత్రిగా నాగబాబు పని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకునే అవకాశాలు లేవు. కానీ పాత సినిమాలను మాత్రం పూర్తి చేయాల్సి ఉంది. వాటిపై వందల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పటికే చాలా రోజులు ఆలస్యం అవుతున్నాయి. ఇక వాటిని వెయిట్ చేయించకూడదని.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మంత్రిత్వ పరంగా నాగబాబు బాధ్యతలు పంచుకుంటే.. ఆయన సినిమాల పనులు వేగంగా పూర్తి చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.