ట్రోలింగ్.. అనేది ఓ అడ్వాన్స్డ్ టెక్నాలజీ..! దాన్ని వాడితే పోలీసులతో కొట్టిస్తారా..! అని… మెగా బ్రదర్ నాగబాబు.. గుంటూరులో.. ఓ రేంజ్లో ఫైరయ్యారు. హఠాత్తుగా గుంటూరులో ఊడిపడిన ఆయన అభిమానులతో సమావేశం నిర్వహించారు. అయితే దీనికి రాజకీయ ఎజెండా లేదు. ముగ్గురు జనసేన కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి కొట్టడంతో… నాగబాబుకు మండిపోయింది. వాళ్లేం చేశారంటే.. ట్రోలింగ్ చేశారని.. ఆయనకు చెప్పారని.. ఆయన మాటల ద్వారా తెలిసింది. ఇంతకీ ఆ ట్రోలింగ్ అంటే ఏమిటో… అది ఎలా అడ్వాన్సుడ్ టెక్నాలజీ అయిందో.. నాగబాబు పూర్తిగా తెలుసుకున్నట్లు లేరు.
ట్రోలింగ్ అంటే… మహిళలపై అసభ్యపదజాలం వాడటమా..?
సోషల్ మీడియా వచ్చిన తర్వాత… ఇష్టం లేని వాళ్లపై.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కామన్ అయిపోయింది. దాన్నే ట్రోలింగ్ అని పేరు పెట్టుకున్నారు. దీన్ని నాగబాబు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంగా అర్థం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన సాదినేని యామినీ శర్మ అనే నాయకులు… టీడీపీ తరపున.. అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆమె.. చేసే రాజకీయ విమర్శలను.. ఆమె తన పేజీలో పోస్ట్ చేస్తూంటారు. దానికి జనసైనికులు.. నాగబాబు చెప్పిన ఈ “అడ్వాన్స్డ్ టెక్నాలజీ”ని… జనసైనికుల రేంజ్లో వాడారు. ఆ ట్రోలింగ్… అత్యంత నీచ స్థాయికి వెళ్లడంతో.. ఆమె పోలీసులకు మొర పెట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి జనసైనికుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఎదుటే.. యామిని శర్మ తమను కొట్టారని వారు… విడిచి పెట్టిన తర్వాత చెప్పుకొచ్చారు. అందులో నిజం ఎంత ఉందో… కానీ.. ” అడ్వాన్స్ టెక్నాలజీని ” అద్భుతంగా వాడుకున్నందుకు తమ కార్యకర్తలను కొడతారా.. అని నాగబాబు … గుంటూరులో దిగి… పోలీసులకు.. టీడీపీకి… వార్నింగ్.. ఇచ్చారు.
ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీనీ అర్ జి వి , శ్రీరెడ్డి వాడినప్పుడు ఎందుకిలా లైట్ తీసుకోలేదు..?
నాగబాబు చెప్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీని… చాలా మంది చాలా రోజులుగా వాడుతున్నారు. వారిలో… శ్రీరెడ్డి అనే మహిళ కూడా ఉన్నారు. ఆమె… పవన్ కల్యాణ్‌ను.. ట్రోల్ చేసింది. అంతే.. దాన్ని మాత్రం.. విడిగా తీసుకున్న మెగా కుటుంబం… మొత్తం… ఫిల్మ్ చాంబర్లో ఓ రోజు రంగస్థలాన్ని ప్రదర్శించింది. ఆ శ్రీరెడ్డికి.. టీడీపీకి లింక్ పెట్టేసి రాజకీయం చేశారు. అసలు ఆ శ్రీరెడ్డి ఎవరు..? ఆమె ఎందుకు.. పవన్ కల్యాణ్‌పై ట్రోలింగ్ అనే అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించింది..? ఆమె బాధేంటి..? ఆమెకు టీడీపీకి ఏంటీ సంబంధం..? మధ్యలో మీడియా సంస్థలు ఏం చేశాయి..? అన్న ఆలోచనల్లేకుండా… ఆవేశంతో.. ఈ ట్రోలింగ్ టెక్నాలజీని.. చెడామడా తిట్టేసినప్పుడు.. ఏమయింది..?. ఇంకా చెప్పాలంటే.. శ్రీరెడ్డి..ట్రోలింగ్ చాలా చిన్నదే. కానీ… పవన్ కల్యాణ్ ప్యాన్స్ వాడే “టెక్నాలజీ” మామూలుగా మనుషులు వాడేది కాదు. దానికో ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. ఆ విషయం రేణుదేశాయ్ కూడా పలు మార్లు చెప్పారు కూడా.
తప్పు ఎవరు చేసినా తప్పే నాగబాబూ గారు..! జనసైనికులకు మినహాయింపు ఉండదు..!
ఏదైనా ఫెయిర్‌గా చేస్తేనే రాజకీయం. తాము చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే…తప్పు అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం…. తాము ఎన్నయినా అనొచ్చు.. తమను మాత్రం ఏమి అనకూడదని అనుకుంటున్నారు. అందులోనూ.. కొన్ని మినహాయింపులు పెట్టుకున్నారు. తమను ఇష్టమైన వారు.. తమపై ట్రోలింగ్ టెక్నాలజీ వాడిని సర్దుకుపోతున్నారు. వారి పక్కన కూర్చుని… పకపక నవ్వులతో.. జబర్దస్తీ చేస్తున్నారు. కానీ ఇష్టం లేని వాళ్లు ఇరవై ఏళ్ల కిందట.. ముఫ్పై ఏళ్ల కిందట… మాట్లాడిన మాటలను గుర్తుకు తెచ్చుకుని చెలరేగిపోతున్నారు. ఇది ఇంకా అడ్వాన్సుడ్ టెక్నాలజీనేమో..? కాస్త ఆలోచించండి నాగబాబు గారూ..!