పవన్ కల్యాణ్ ని రాజకీయ ఊసరవెల్లి అంటూ విమర్శించాడు ప్రకాష్ రాజ్. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం ఆయనకు ఏమాత్రం నచ్చలేదు. అందుకే.. ఇలా ఆవేశ పడ్డాడు. అయితే.. పవన్ కల్యాణ్ తో పెట్టుకుంటే ఏమవుతుందో ప్రకాష్ రాజ్‌కి తొందరగానే అర్థమైంది. నిన్న ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలకు.. ఇప్పుడు కౌంటర్లు వస్తున్నాయి. తొలిగా బాణాన్ని సంధించింది.. మెగా బ్రదర్ నాగబాబునే.
“రాజకీయాల్లో అనేకసార్లు నిర్ణయాలు మారుతూ ఉంటాయి. ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం ప్రజలకు మంచి చేయడం అయితే.. విమర్శించే అవసరం లేదు. జనసేన బీజేపీకి మద్దతు ఇవ్వడం వెనుక విస్త్రృత ప్రజా ప్రయోజనాలున్నాయి“ అంటూ పేర్కొన్న నాగబాబు.. పనిలో పనిగా ప్రకాష్ రాజ్ పై తన ప్రతాపం చూపించేశారు.
“ప్రతీ పనికి మాలినవాడూ.. విమర్శిస్తున్నాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్.. నీ రాజకీయ డొల్లతనం ఏమిటో.. బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి డిబేట్ లోనే అర్థమైంది. నిన్ను తొక్కి పెట్టి నార తీస్తుంటే, మాట్లాడలేక తడబడడం ఇంకా గుర్తుంది“ అంటూ ప్రకాష్ రాజ్ పై విమర్శనా బాణాలు వదిలాడు. నిర్మాతల్ని డబ్బుల కోసం హింసించి, ఇచ్చిన డేట్స్ కాన్సిల్ చేసి, కాల్చుకుతిన్నావ్.. అంటూ.. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. ముందు ఓ మంచి మనిషిగా మారి, అప్పుడు విమర్శించు అని హితవు పలికాడు.
మొత్తానికి ప్రకాష్ రాజ్ కి పవన్ సెగ తగలడం మొదలైంది. అయితే.. ప్రకాష్ రాజ్ ఊరుకునే కూర్చునే రకం కాదు. తను కూడా కౌంటర్లు ఇవ్వడం మొదలెడతాడు. దాంతో.. ఇది కాస్త చినికి చినికి గాలివాన గా మారే ప్రమాదం ఏర్పడింది. పవన్ ని ఏమన్నా.. నాగబాబు విరుచుకుపడిపోవడం మామూలైపోయింది. నాగబాబు ఎంట్రీతో చిన్న విషయాలే పెద్దవి అవుతున్నాయని కొంతమంది మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు ఫీలవుతున్నారు. మరి కొంతమందైతే.. ఇలా ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వకపోతే.. కొన్ని నోళ్లు ఆగవు అనుకుంటున్నారు. ఏది ఏమైనా… ఇప్పుడు టాలీవుడ్ లో పవన్ వెర్సెస్ ప్రకాష్ రాజ్.. ఎపిసోడ్‌కి అజ్యం పోయగలిగాడు నాగబాబు.