మెగా బ్రదర్ నాగబాబు తన పేరుతో ఓ యుట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ‘మై పెర్స్పెక్టివ్’ (నా దృక్కోణం) పేరుతో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. మొన్న పెద్ద నోట్ల రద్దు పై కూడా మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ సుధీర్గమైన వీడియో ఒకటి అప్లోడ్ చేశారు. ఇప్పుడు మరో వీడియోను రిలీజ్ చేశారు. ఇది ఎవరి గురించో కాదు. తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించే. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, రాజకీయ భవిష్యత్ పై ఇందులో మాట్లాడారు నాగబాబు. పవన్ కళ్యాణ్ ను సినిమాల్లో చూసి తర్వాత అభిమానులు, ప్రేక్షకులు ఆపాదించిన ఇమేజ్ కాకుండా..కళ్యాణ్ బాబును బాల్యం నుండి ఇప్పటివరకూ పరిశీలిస్తున్న వ్యక్తిగా ఈ విషయాల్ని చెబుతున్నానని మొదలుపెట్టిన నాగబాబు దాదాపు అరగంట సేపు మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ చాలా ఇంట్రావర్ట్. చిన్నప్పప్పటి నుండే గొప్ప వ్యక్తిత్వం,ఆలోచన ధోరణి అలవర్చుకున్నాడు. తను ఆబద్ధం మాట్లాడటం నేను వినడలేదు. గొప్పగా చదువుకోలేదు కానీ, గొప్ప జ్ఞానం సంపాదించాడు. పాఠ్యపుస్తకాలు కంటే సమాజానికి సంబధించిన పుస్తకాలనే ఇష్టంగా చదివేవాడు. విందులు, వినోదాలు, ఆడంబరాలు వాడికి తెలియదు. ఇంట్లో వుండి కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. తనతోనే తాను మాట్లాడుకునేవాడు. ఎప్పుడూ ఎదో ఆలోచనలతో వుండేవాడు. డైరెక్టర్ కావాలనుకున్నాడు. కాని ఇంట్లో అందరం హీరోగా అయితే బావుటుందని అనుకున్నాం. అలాగే హీరో అయ్యాడు. గొప్ప ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. స్టార్ గా కంటే ఓ విలక్షణమైన వ్యక్తిగా కళ్యాణ్ బాబుకు ఎక్కువ మంది ఫ్యాన్స్ వున్నారు.
అన్నయ్య చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత వాడూ రాజకీయాల్లోకి వచ్చాడు. పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. అయితే విలీనం పరిస్థితి వచ్చినపుడు వాడికి అది నచ్చలేదు. ఆ సమయంలో విబేధించాడు. విబేధించడం అంటే అన్నయ్యకు ఎదో ఎదురుతిరిగి మాట్లాడటం కాదు. మౌనంగా వుండిపోయాడు. చిన్నప్పటినుండి వాడ్ని చూస్తున్నాం. వాడు మాకు బాగా తెలుసు. అందుకే అన్నయ్య కూడా వాడి అభిప్రాయలకు గౌరవం ఇచ్చారు. వాడిని ఇబ్బంది పెట్టలేదు. అది అలా ముగుసిపోయింది. ఈ విషయంలో వాడూ ఎప్పుడు మాట్లాడలేదు. తర్వాత కొంత కాలనికి జనసేన స్థాపించాడు. బిజెపి,టీడీపీ లకు మద్దత్తు ఇచ్చాడు. అయితే ఆ సమయంలో నేను అన్నయ్య వైపు నిల్చున్నాను. కళ్యాణ్ బాబు ఒక్కడే పోరాటం చేశాడు. ఆ ఎన్నికల్లో కూటమి గెలుపులో కీలక పాత్రపోషించాడు. ఇప్పుడు ఎన్నికలకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు నా మద్దత్తు వాడికే. నేను వాడికే ఓటు వేస్తా” అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు.
నాగబాబు మాటలు పరిశీలిస్తే.. ఇందులో చాలా వరకూ తెలిసిన విషయాలే మాట్లాడారు. లేదంటే ఈసారి పవన్ కళ్యాణ్ కాస్త ఎక్కువ పొగిడారు. తను భూమిపై చూసిన పదిమంది గొప్ప మనుషులలో కళ్యాణ్ బాబు ఒకడని, అలాంటి కళ్యాణ్ బాబు రాష్ట్రానికి నాయకత్వం వహించడం చారిత్రాత్మక అవసరమని, కళ్యాణ్ బాబు లేకుంటే టీడీపీ ఖచ్చితంగా ఓటమిపాలయ్యేదని, ప్రస్తుతం రాజకీయాల్లో జనసేనకు మించిన ప్రత్యన్నాయం లేదని ఇలా పొగడ్తల వర్షం కురిపించాడు నాగబాబు.
దీంతో పాటు ఓ రెండు వివాదాలపై క్లారిటీ కూడా ఇచ్చాడు నాగబాబు. ఒకటి. ఒక మెగా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను తిట్టడం. రెండు. జనసేన పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కు మద్దత్తు చెప్పకపోవడం. ” అన్నయ్య ఫంక్షన్ లో కళ్యాణ్ పేరుతో అల్లరి చేయడం కళ్యాణ్ బాబుకు కూడా నచ్చదు. ఇలా జరుగుతుందని వాడికి తెలిస్తే ఖచ్చితంగా బాధ పడతాడు. అందుకే అదిశ్రుతి మించడంతో కాస్త గట్టిగా చెప్పాల్సివచ్చింది. ఇక రెండు. గత ఎన్నికల్లో అన్నయ్య వెనుక నిలబడ్డాను. మా అందరికి మార్గదర్శి అన్నయ్య. ఆలాంటి అన్నయ్యను వంటరిగా వదల్లేను. అందుకే అప్పుడు అన్నయ్య వెనుక వున్నా” అని వివరణ ఇచ్చుకున్నారు నాగబాబు.
అంతా బాగానే వుంది కానీ, ఈ వీడియోలో ఒక విషయం మాత్రం చాలా క్లారిటీగా చెప్పేశారు నాగబాబు. ఇకపై తాను కళ్యాణ్ బాబు వెనుక వుంటానని. అంతేకాదు మెగా ఫ్యాన్స్ ను కూడా కళ్యాణ్ బాబుకే సపోర్ట్ చేయాలని సూచిస్తానని చెప్పారు. చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే వున్నారు. ఇప్పుడు నాగబాబు మాత్రం కళ్యాణ్ బాబుకు జై కొట్టారు. మరి , ఇప్పుడు అన్నయ్యను వంటరి చేయడం కాదా.?అలాగే టోటల్ ఫ్యాన్స్ ను సపోర్ట్ ను జనసేన వైపు మెర్జ్ చేస్తానని సెలవిస్తున్నారు నాగబాబు. అంటే చిరంజీవి రాజకీయ సన్యాసం తీసుకున్నారని ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చారాని అర్ధం చేసుకోవాలా?నాగబాబు మాటలు వింటే అలానే అనిపిస్తుంది.