సావిత్రి జీవితకథ ఆధారంగా ‘మహానటి’ మొదలు పెట్టిన ముహూర్తం నుంచి ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ, అటు ప్రేక్షకులలోనూ ఒక్కటే ఆసక్తి… నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలు ఎవరు చేస్తారు? అని! అచ్చు తాతయ్య పోలికలతో వుండే జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని యువ మన్మథుడు నాగచైతన్య చేస్తే బాగుంటుందని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే… ‘మహానటి’ చిత్రబృందం సంప్రదిస్తే ఎన్టీఆర్, చైతన్య ఇద్దరూ సున్నితంగా తిరస్కరించారు. తొలుత ఎన్టీఆర్ చేస్తే నేనూ చేస్తానని కండీషన్ పెట్టిన నాగచైతన్య చివరకు అంగీకరించారు. ‘మహానటి’గా తాతయ్యగా కనిపించడానికి, నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రెండు రోజులు షూటింగ్ చేయడానికి డేట్స్ కూడా ఇచ్చాడు. త్వరలో చైతన్యపై సన్నివేశాలు తీయనున్నారు. ‘మహానటి’కి అక్కినేని దొరికాడు గానీ.. ఎన్టీఆర్ ఇంకా దొరకలేదు. నాని నుంచి మొదలుపెడితే తమిళ నటుడు సూర్య వరకు చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి, ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారో? సావిత్రిగా కీర్తీ సురేష్, ‘జెమినీ’ గణేశన్ పాత్రలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, విలేకరిగా సమంత, కీలక పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాకు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకుడు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై సినిమా రూపొందుతోంది.